Kavitha – KTR : ప్రెస్‌మీట్లు చాలా స్ట్రాటజిక్‌గా ఉంటాయి. అల్లాటప్పాగా వచ్చి మట్లాడేయరు. ఎవరుపడితే వారు వచ్చి కూర్చోరు. టార్గెట్ చేయాల్సిన లీడర్ స్థాయిని బట్టి కౌంటర్ ఉంటుంది. మంత్రి మాట్లాడితే మాజీ మంత్రి. బీసీ లీడర్‌ను బీసీ నేతతో.. ఎస్సీ నాయకుడిని అదే వర్గం వ్యక్తితో.. మహిళ అయితే మహిళతో.. ఇలా ప్రతీదానికో లెక్క ఉంటుంది. దాని వెనుక రాజకీయం కూడా ఉంటుంది. లేటెస్ట్ ప్రెస్‌మీట్‌తో కేటీఆర్ సైతం కవితకు అలాంటి మెసేజే ఇచ్చారంటున్నారు. ఆ కవిత పోతే ఈ కవిత అనేలా.. ప్రెస్‌మీట్‌కు తనతో పాటు మాజీ ఎంపీ మాలోత్ కవితను తీసుకొచ్చారా? మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పక్కన కూర్చోబెట్టుకోవడం వెనుక గట్టి వ్యూహమే ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ కోవర్టులు ఎవరు?
కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి.. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ కాక రేపారు కవిత. ఆ దెయ్యాలు ఎవరు? ఆ కోవర్టులు ఎవరు? అంటూ అప్పుడే రచ్చ మొదలైంది. అందరిచూపులు కేటీఆర్ వైపే మళ్లాయి. దెబ్బకు ఉలిక్కిపడిన వర్కింగ్ ప్రెసిడెంట్.. వెంటనే కౌంటర్ ప్రెస్‌మీట్ పెట్టారు. కేవలం కవిత గురించే మాట్లాడితే అస్సలు బాగోదనుకున్నారో ఏమో.. మీడియా ముందుకు వచ్చి ఎప్పటిలానే సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టిపోసి.. అనేక విమర్శలు చేసి.. చివరాఖరికి కవిత ఆరోపణలపై స్పందించారు. తమ పార్టీలో ఎవరైనా లేఖలు రాయొచ్చని.. కాకపోతే పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్‌లో సీఎం రేవంత్ కోవర్టులు ఉంటే ఉండొచ్చన్నారు. దెయ్యాల టాపిక్ మాత్రం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. కవిత అంతలా రెచ్చిపోయి హాట్ కామెంట్స్ చేస్తే.. కేటీఆర్ మాత్రం చాలా సింపుల్ పదాలతో మమ అనిపించడం ఆసక్తికరం. అంతకుమించి ఇంట్రెస్టింగ్ పాయింట్ మరొకటి ఉంది.
మాలోత్ కవితతో ఏం మెసేజ్ ఇచ్చినట్టు?
ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌కు ఇరువైపులా మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉండటం వ్యూహాత్మకమే అంటున్నారు. తన చెల్లి, ఎమ్మెల్సీ కవిత పార్టీపై ఆరోపణలు చేశారు కాబట్టి.. ఆమెకు సాటిగానా అన్నట్టు ఆమె పేరే ఉన్న మాలోత్ కవితను పక్కన కూర్చోబెట్టి.. స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఆ కవితను ఈ కవితతో సరి పోల్చిలా.. ఆమె స్థాయి తగ్గించే ప్రయత్నం ఉందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో అందరూ కార్యకర్తలే నంటూ కేటీఆర్ చెప్పడం కూడా.. కవిత ఓ సాధారణ కార్యకర్తనే అనే మెసేజ్ ఇచ్చినట్టు ఉందని అంటున్నారు. లేదంటే.. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లాంటి మహిళా నేతలు ఉండగా.. కావాలానే కవిత పేరుతో ఉన్న మాలోత్ కవితను కేటీఆర్ పక్కనే కూర్చోబెట్టడం మామూలు విషయంగా చూడలేమని చెబుతున్నారు.
గౌడన్నతో లెక్క అదేనా?
కేటీఆర్‌కు ఇంకో వైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆయన ప్లేస్‌మెంట్ కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ప్రజల్లో లేరని.. అమెరికా నుంచి ఊడిపడ్డారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. కాంగ్రెస్ పదే పదే ఆ ఆరోపణ చేస్తూ ఉంటుంది. ఉద్యమ కాలంలో జేఏసీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జాగృతి తరఫున కల్వకుంట్ల కవిత.. యాక్టివ్‌గా ఉండేవారు. అలా కవిత, శ్రీనివాస్ గౌడ్‌లకు తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు ఉంది. ఇప్పుడు కవిత రెబెల్ వాయిస్ వినిపిస్తుండటంతో.. ఆనాటి ఉద్యమకారులు ఆమెకు సపోర్ట్‌గా మళ్లే ఛాన్సెస్ ఉండొచ్చు. ఆ అవకాశం ఇవ్వకుండా మరో ఉద్యమ నేత శ్రీనివాస్‌గౌడ్‌ను తన పక్కనే కూర్చోబెట్టి.. ఉద్యమకారుల సపోర్ట్ తమకే అనేలా కేటీఆర్ సిగ్నల్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు.
Also Read : దెయ్యాలు ఎవరు? కోవర్ట్ నువ్వా నేనా? కేటీఆర్ రియాక్షన్ ఇదే..
పైపైన చూస్తే అది జస్ట్ ప్రెస్‌మీట్ మాత్రమే కావొచ్చు. కానీ, పొలిటికల్ కళ్లతో చూస్తే కవిత, శ్రీనివాస్‌గౌడ్‌లతో ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ స్ట్రాంగ్ మెసేజే ఇచ్చారని అంటున్నారు. అట్లుంటది మరి రాజకీయమంటే.