BRS: జనగామ జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహం చంపక్‌హిల్స్ క్రషర్ సమీపంలో గుర్తించారు. భూ వివాదంలో రామకృష్ణయ్యను సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్యను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. భూతగాదాలు, ఆర్‌టీఐ సమాచార సేకరణే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో పాటు ముగ్గురు నిందితులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రోద్బలంతోనే రామకృష్ణయ్య కిడ్నాప్, హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బచ్చన్నపేటకు చెందిన BRS నాయకుడు అంజయ్యపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్తున్నారు. అసైన్డ్ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని అంజయ్య పలుమార్లు కలిశాడని.. దానికి తన తండ్రి రామకృష్ణయ్య నిరాకరించాడని కుమారుడు తెలిపాడు. భూమి రిజిస్ట్రేషన్ చేయలేదనే కక్షతోనే కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు.
బచ్చన్నపేటలో రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్యపై కుటుంబసభ్యులు రహదారిపై ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. కిడ్నాప్ అయిన రోజునే పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించలేదని మండిపడ్డారు. మరో వైపు నిరుపేదల భూమి కోసం పోరాటం చేశాడన్న కారణంతోనే హత్య చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.