Jagga Reddy: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది నూటికి నూరుపాళ్లు సరైనదేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా తప్పుల తడక అని, ఇరిగేషన్ గురించి ఆయనకు మాత్రమే తెలివి ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి కాళేశ్వరం కట్టిన తర్వాతే జనం నీళ్లు తాగుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని జగ్గారెడ్డి అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. “హైదరాబాద్‌లో ఉంటున్న కేసీఆర్ కుటుంబం ఇన్నాళ్లు కాంగ్రెస్ కట్టిన మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదా? ఆ నీళ్లు తాగి పెరిగే ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ వల్లే తెలంగాణలో బోరు బావుల కింద సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.
అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలకు మళ్లీ ఆంధ్రా వ్యతిరేకత గుర్తుకొచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు, కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు ఆంధ్రా పగ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం “తోలు తీస్తాం” అని మాట్లాడితే, తమ వాళ్ళు “నాలుకలు కోస్తాం” అని కౌంటర్ ఇచ్చారని సమర్థించుకున్నారు.
2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీతో తాను నిర్వహించిన భారీ సభను చూసి కేసీఆర్ భయపడ్డారని, అందుకే తనపై అక్రమ కేసులు బనాయించి వేధించారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెచ్చింది, ఇప్పుడు కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి అధికారం లేదు కాబట్టి, తెలంగాణలో ఆ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదని కొట్టిపారేశారు.
Read Also: కేసీఆర్ చావు కోరుకునేది కేటీఆర్, హరీష్ రావులే.. రేవంత్ కాదు: ఎంపీ చామల ఫైర్