Jagityal News: ఆడపిల్ల పుడితే బోరుమని ఏడ్చిన రోజులను గతంలో చూశాం. అంతేకాదు ఆడపిల్ల పుడితే అత్తారింటి వేధింపులు కూడా చూసే ఉంటారు కొందరు. ఇక్కడ మాత్రం ఆడపిల్ల పుట్టిందని, ఓ యువకుడు ఏకంగా గ్రామంలో పెద్ద సంబరమే జరిపాడు. అది కూడా అలా ఇలా కాదు.. తన కూతురి జన్మదినం గ్రామమంతా గుర్తుండేలా చేశాడు. ఇంతకు అతనెవరు? అలా ఎందుకు చేశాడో తెలుసుకుందాం.
నేటి సమాజంలో ఇప్పటికీ అక్కడక్కడా అమ్మాయిల పట్ల వివక్షత కనిపిస్తోంది. అమ్మాయి పుట్టిందంటే.. లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందన్న ఆనందం కూడా కొందరిలో కనిపిస్తుంది. పూర్వం ఆడపిల్ల పుడితే, ఆ కోడలికి అత్తారింట వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ఆడపిల్ల అంటూ కొద్దిగా అనుమానం వచ్చినా భ్రూణ హత్యలు కూడా జరిగేవి. కాలం మారింది.. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవిలా భావిస్తున్న రోజులనే చెప్పవచ్చు. అలా చెప్పేందుకు ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఓ యువకుడు చేసిన సంబరాన్ని వర్ణించవచ్చు.
తుంగూరు గ్రామంలో ఒగలపు అజయ్ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇటీవల అమ్మాయి పుట్టింది. సాధారణంగా సంతాన భాగ్యం కలిగితే, స్వీట్లు పంచుతాం. అజయ్ అలా చేయలేదు. గ్రామం మొత్తం సందడి సందడి చేశారు. ఆడపిల్ల పుట్టడం తాను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నట్లు చెప్పిన అజయ్ చేసిన పనికి ఊరంతా నివ్వెర పోయింది. గ్రామంలో ఉన్న 1500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశాడు అజయ్.
అంతేకాదు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ. 14 వేల విలువ గల సెల్ ఫోన్లు సైతం పంచి పెట్టాడు. దీనితో అజయ్ ఇంట పండుగ వాతావరణం కనిపించింది. అందరూ కానుకలు స్వీకరించి అజయ్ దంపతులను, చిన్నారిని దీవించారు. ఇలా గ్రామం మొత్తం సంబరాలు నిర్వహించడంపై అజయ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదన్న అభిప్రాయాన్ని, సమాజానికి చాటి చెప్పేందుకు ఇలా చేశానన్నారు.
Also Read: Teenmar Mallanna – Pushpa 2: ‘పుష్ప 2 లాభాల్లో 10 శాతం శ్రీ తేజ్ కు ఇవ్వాలి’
ప్రతిఒక్కరూ ఆడపిల్లల పట్ల గౌరవంగా మెలగాలి, వారి ఉన్నతికి పాటుపడాలని అజయ్ కోరారు. చిన్న గ్రామంలో ఆడపిల్లలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు అజయ్ చేసిన పనికి గ్రామమే కాదు, మండలం మొత్తం అభినందనలు తెలుపుతున్నారు. ఏదిఏమైనా ఒక తండ్రిగా అజయ్ చేసిన పని, సమాజంలో ఆడపిల్ల గౌరవాన్ని పెంపొందించడం విశేషం.