జగిత్యాల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తన సొంత పార్టీ తీరుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని, సీనియర్లను విస్మరిస్తున్నారని ఆవేదన చెందుతున్న ఆయన, తాజాగా జగిత్యాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ప్రస్తావన
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని పిలుపునిచ్చారు. కానీ నేను మాత్రం సంస్కారంతో ఆలోచిస్తున్నాను. ఆ ఎమ్మెల్యేలను రాళ్లతో కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లతో కొట్టాలని పిలుపునిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన పరోక్షంగా తన నిరసనను వ్యక్తం చేశారు.
నా గొంతు కోయలేరు
తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి ఆరోపించారు. ‘కొందరు నా గొంతు కోయాలని చూస్తున్నారు. కానీ వారికి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నా గొంతు కోయాలంటే ముందు నా భుజాల్లాంటి నా కార్యకర్తలను దాటి రావాలి’ అంటూ హెచ్చరించారు. దశాబ్దాలుగా తన వెన్నంటి ఉన్న కార్యకర్తలే తన బలమని, వారిని కాదని తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
తీవ్ర ఆవేదనలో సీనియర్ నేత
చాలా కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ‘నా రాజకీయ జీవితం ముగిసే సమయంలో నాకు దుఃఖం తెప్పించారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి. క్రమశిక్షణతో ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తనకు, ఇప్పుడు తగిన గుర్తింపు లేకపోవడంపై ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. అసలు పార్టీలో సీనియర్లకు చోటు ఉందా? లేదా? అని ఆయన నిలదీశారు.
పలుమార్లు ప్రభుత్వంపై, పార్టీ అంతర్గత నిర్ణయాలపై మండిపడ్డ జీవన్ రెడ్డి, తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.