Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయినా బైపోల్‌లో తిరిగి ఆయనకే బీజేపీ అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. దీపక్‌రెడ్డి గెలుపు బాధ్యతలను కేంద్రమంత్రి, లోకల్ ఎంపీ కిషన్‌రెడ్డి భుజాన వేసుకున్నారు. బీజేపీ మూడో స్థానానికి పరిమితమవుతుందని సర్వేలు చెప్తుతున్నా… బీజేపీ మరోసారి సెంటిమెంట్‌పై నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా జూబ్లీహిల్స్‌లోను గెలుస్తామని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాషాయ పార్టీ నవంబర్ నెల సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకుందట. గతంలో నవంబర్ నెలలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాషాయపార్టీ విజయ దుందుభి మోగించింది. అదే నెలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఒక వర్గానికి చెందిన పార్టీ శ్రేణులు జోష్‌లో ఉన్నారంట. గతంలో ఉప ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరినట్లే ఈ ఎన్నికల్లోనూ విజయసాధించి తీరతామని బీజేపీలోని ఒక వర్గం శ్రేణులు ధీమాతో ఉన్నాయట.
దుబ్బాక ఉప ఎన్నిక 2020 నవంబర్‌లో జరిగింది. ఉత్కంఠ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ నేత రఘునందన్ రావు 1079 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా 2021 నవంబర్‌లోనే వెలువడ్డాయి. బీఆర్ఎస్‌కు తన ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలుగా అప్పట్లో ఆ పోరును అభివర్ణించిన బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ … గులాబీ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 24,068 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అదే తరహాలో ఈసారి కూడా విజయతీరాలకు చేరుతామని శ్రేణులు భావిస్తున్నాయట. నవంబర్ లో జరిగిన రెండు బైపోల్స్లో విజయబావుటా ఎగురవేసినట్లే ఈసారి కూడా విజయతీరాలకు చేరి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాతో పార్టీ ఉందట.
జూబ్లీహిల్స్‌లో 7 డివిజన్లు ఉన్నాయి. నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్ల కీలకమని అందరూ భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం మైనార్టీ ఓట్ బ్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదని వాదిస్తోంది. ఈ ఎన్నికల్లో ఇవేవి వర్కువుట్ అయ్యే చాన్స్ లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మిగతా ఓట్లన్నీ తమ పార్టీకే పడుతాయనే ధీమాతో కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారట.
ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనను చూశారని…వారి మోసాలు చూసి ప్రజలంతా బీజేపీ వైపునకు ఆకర్షితులవుతున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ ఒక్క అంశమే తమ గెలుపును డిసైడ్ చేస్తుందనే ధీమాతో ఉన్నారట కాషాయం నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తాము కింగ్ మేకర్ కాదని, కింగ్ గా నిలుస్తామని ధీమాతో ఉన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సిగ్మెంట్‌లోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న బైపోల్‌లో విజయం సాధించడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ చేప్పాలనే భావనలో కిషన్ రెడ్డి ఉన్నారట.
అదలా ఉంటే ప్రచారంలో ఇతర పార్టీల కంటే కాస్త వెనుకబడి బీజేపీ ఉందనే టాక్ వినిపిస్తోందట. ఆ క్రమంలో కేంద్ర నాయకత్వం కూడా బైపోల్‌పై ఫోకస్ చేయడంతోపాటు పలు సూచనలు చేస్తుందట. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ విస్తృతంగా పనిచేస్తోందని శ్రేణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇంటింటికీ వెళ్లి గ్రౌండ్ లెవల్లో ప్రచారం చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పదేళ్ల పాలన చూసిన ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయబోరని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలకు అమలు చేయడంతో విఫలమవడం తమకు ప్లస్ అవుతుందని కమలదళం భావిస్తోందట.
జూబ్లీహిల్స్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 43.28 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి గెలుపు కూడా పోలింగ్ శాతం పైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబర్ సెంటిమెంట్ కాషాయ పార్టీకి కలిసొస్తుందా…లేదా అనేది తేలాలంటే ఈనెల 14 వరకు ఆగాల్సిందే.
Story by Apparao, Big Tv