Harish Rao: బీజేపీ అంటేనే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీది సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కాదని.. పూరా బక్వాస్ అని తీవ్ర విమర్శలు చేశారు. వడ్లకో నీతి గోధుమలకో నీతా..? తెలంగాణ బీజేపీ ఎంపీలకు కేంద్రాన్ని అడిగే దమ్ముందా..? అని హరీష్ రావు సవాల్ చేశారు.
ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే కేంద్రం మెడలు వంచి పనులు చేసుకోవచ్చని అన్నారు. ఏపీలో టీడీపీ ఇప్పుడు అదే చేస్తుంది. సీఎం రేవంత్ కేరళ, కర్ణాటక, ఢిల్లీ తిరగడానికి సరిపోతుంది. రాష్ట్రంలో RR టాక్స్ నడుస్తుంది. పోలీసులు మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పింక్ బుక్ లో రాసుకుంటాం. మా ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసుల పని పడతాం. కేసీఆర్ వచ్చాకే మార్కెట్ కమిటీల్లో బీసీలకు అవకాశం ఇచ్చాం. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్. జేబులో కత్తెర పెట్టుకొని కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నాడు’ అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ చెమట ఒడ్చి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం
రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడం ఇదే రేవంత్ పని. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్ మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ కి నీళ్లు ఎలా తీసుకువెళ్తున్నాడు..? కేసీఆర్ చెమట ఒడ్చి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మల్లన్నసాగర్ ప్రాజెక్టు సీఎం రేవంత్ నాన్న కట్టారని నీళ్లు తీసుకువెళ్తున్నారా..?తలకిందులుగా తపస్సు చేసినా ఇక సీఎం రేవంత్ మాటలను ఇక ప్రజలు నమ్మరు. సంగారెడ్డి జిల్లాలో లక్షా 20 ఎకరాల సాగు కోసం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు తెచ్చారు మాజీ సీఎం కేసీఆర్. త్వరలో సంగమేశ్వర బసవెశ్వర ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ అని అన్నారు.
2 లక్షల పింఛన్లు గోవిందా..?
కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అని జనాలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రామిసరి నోట్, బాండ్ పేపర్ లకు విలువ లేకుండా చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చాక కొత్త పింఛన్లు ఇవ్వలేదు కానీ 2 లక్షల పింఛన్లు తీసేశారు. రెండు నెలల పించన్ ఎగగొట్టారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి గ్రామంలో పంచాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడగటానికి వస్తే హామీలపై నిలదీయండి. కల్యాణ లక్ష్మీ పథకంలో 8 లక్షల తులాల బంగారం కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ALSO READ: RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు
2లక్షల ఉద్యోగాలు ఏమైనయ్..?
నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రేవంత్ ఎన్నికల ముందు రజిని కాంత్ తర్వాత గజిని కాంత్ లా అయ్యారు. ఫ్యూచర్ సిటీలో రోడ్లు, మూసీ సుందరికరణ కోసం నిధులు ఉంటాయి. ప్రజలకు ఇచ్చే పథకాల కోసం మాత్రం నిధులు ఉండవు. కేసీఆర్ 33 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రేవంత్ 19 వేల కోట్ల రూపాయలే రుణమాఫీ చేశారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ, చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో BRS గెలవడం పక్కా’ అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.