Bihar Elections: ఎట్టకేలకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది.. భారత ఎన్నికల సంఘం కాసేపటి క్రితమే ఎన్నికల షెడ్యూల్ ను ఫైనల్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ తేదీల వివరాలను వెల్లడించారు.
రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో పోలింగ్ జరగనుందని చెప్పారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
జేడీయూ నేత నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కానీ కొంత కాలానికే ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి మఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే.. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో మరోసారి సీఎం అయ్యాడు నితీష్ కుమార్. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జేడీయూ 12 ఎంపీ సీట్లు సాధించి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది.
ALSO READ: RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు
బిహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై ఎన్నికల ప్రధాని అధికారి జ్ఞానేశ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదాను ఆగస్టు 1న విడుదల చేశామని చెప్పారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం కూడా కల్పించినట్టు పేర్కొన్నారు. ఫైనల్ జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటించామని వివరించారు. ఇప్పటికీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని ఆయన తెలిపారు.
ALSO READ: Nobel Prize Winners: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. వారి పేర్లు ఇవే