HBD Hema Malini:ఎవరిలో అయినా సరే వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ సెలబ్రిటీలు మాత్రం నిత్యం యవ్వనంగా కనిపించడానికి ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంది. అందంగా కనిపించడమే కాకుండా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వృద్ధాప్య వయసుకు చేరుకున్నా కూడా ఇంకా అంతే యవ్వనంగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలా ఇప్పటికే లేటు వయసులో కూడా తమ ఫిట్నెస్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్న హీరోయిన్స్ ఎంతోమంది అని చెప్పాలి. అయితే వారు ఏం తింటారు? ఎలా ఆ ఫిట్నెస్ మైంటైన్ చేస్తారు? అనేది విషయాలు తెలియక అభిమానులు కూడా కాస్త సతమతమవుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే 77 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న హేమమాలిని ఫిట్నెస్ సీక్రెట్ కాస్త బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత కఠినమైన నియమావళిని పాటిస్తున్నారు కాబట్టి ఈ వయసులో కూడా ఇంతే యంగ్ గా, ఆరోగ్యంగా ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. పైగా ఈరోజు హేమమాలిని పుట్టినరోజు కూడా.. ఈ సందర్భంగా హేమమాలిని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ మాలిని తన ఫిట్నెస్ సీక్రెట్ ను బయట పెట్టడంతో ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో హేమమాలిని మాట్లాడుతూ.. “ఉదయం ఒక కప్పు టీతో నా రోజు ప్రారంభం అవుతుంది. రోజుకు రెండు కప్పుల టీ మాత్రమే తీసుకుంటాను. పాలు , కుంకుమ పువ్వుతో మరిగించిన టీ మాత్రమే తీసుకుంటాను. టీతోపాటు క్రిస్పీ మేరీ బిస్కెట్లు తింటాను..అల్పాహారంలో ఇడ్లీలు మాత్రమే తింటాను. వడలు వంటి వాటికి దూరంగా ఉంటాను. ఇక ఆదివారాలలో పెరుగుతో పన్నీర్ పరాఠా చేసుకొని తింటాను.
ALSO READ:Kriti Sanon: ఇంటర్నేషనల్ స్టేజ్‌పై ప్రభాస్ బ్యూటీ.. తొలి భారతీయ నటిగా గుర్తింపు!
సోమవారం శివుడి కోసం, శుక్రవారం దుర్గాదేవి కోసం ఉపవాసం ఉంటాను. ఉపవాసం చేస్తున్నప్పుడు ఉప్పులేని చిన్న పన్నీర్ ముక్కలు రెండు, అరటి పండ్లు , ఒక గ్లాసు నారింజ రసం మాత్రమే తీసుకుంటాను. ఉపవాసం సమయంలో సలాడ్ , ఉప్పు లేకుండా కొన్ని ఉడికించిన కూరగాయలు తింటాను. సాయంత్రం 6:30 వరకు మాత్రమే ఉపవాసం చేస్తాను. షూటింగ్ కి వెళ్లేటప్పుడు నా భోజనాన్ని నేనే ఇంటి నుంచి తీసుకెళ్తాను. నాకు దక్షిణాది వంటలంటే చాలా ఇష్టం. కాబట్టి రసం, కొంచెం కారంగా ఉండే దక్షిణ భారత సూప్ లాంటి వంటకాన్ని తీసుకుంటాము. అన్నం తినేటప్పుడు చపాతీలు తినకూడదు అనే నియమాన్ని కూడా నేను పాటిస్తాను. నేను స్వచ్ఛమైన శాకాహారిని. సనాతన అయ్యంగార్ కుటుంబానికి చెందిన దాన్ని కాబట్టి మాంసాహారం తీసుకోను.” అంటూ ఇలా ఫిట్నెస్ రహస్యాలను బయట పెట్టింది హేమ మాలిని.