Sovereign Gold Bond: 8 ఏళ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టారు. 0సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2017-18 సిరీస్-III ఫైనల్ రిడెంప్షన్ ధరను ఆర్బీఐ ప్రకటించింది. తుది రిడెంప్షన్ లో పెట్టుబడిదారులు ప్రతి గ్రాము బంగారానికి రూ. 12,567 రాబడి అందుకోనున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ఆధారంగా అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో బంగారం ముగింపు ధరతో గోల్డ్ బాండ్ల ధరను లెక్కించారు.
దీంతో దీపావళి ముందు పెట్టుబడిదారులకు సూపర్ గిఫ్ట్ అందుకోనున్నారు. 2017-18 సిరీస్-III గోల్డ్ బాండ్లపై ఆర్బీఐ ఫైనల్ రిడెంప్షన్ తేదీని అక్టోబర్ 16గా ఆర్బీఐ ప్రకటించింది. గతంలో పెట్టుబడి పెట్టిన వారికి 338 శాతం రాబడి లభించింది.
2017-18 సిరీస్-III గోల్డ్ బాండ్లను 2017 అక్టోబర్ 16న ఆర్‌బీఐ కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. అప్పట్లో ఒక గ్రాము బంగారం ధర రూ.2,866 కాగా.. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ బాండ్లు అక్టోబర్ 16, 2025న మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం 999 స్వచ్ఛత కలిగిన బంగారం ఒక గ్రాము ధరను రూ.12,567గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి కొనుగోలు ధరను తీసేస్తే ఒక్కో గ్రాముకు రూ.9,701 లాభం వచ్చినట్లు తెలుస్తోంది. అంటే 338 శాతం రాబడి దక్కింది. దీంతో పాటు ఏటా చెల్లించే 2.5 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.
గోల్డ్ లో పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం నవంబర్ 2015లో SGB పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ బాండ్లను కేంద్రం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. ఈ బాండ్లపై పెట్టుబడిదారులకు రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఇష్యూ ధరపై ఏటా 2.5% వడ్డీతో పాటు బంగారం ధరలకు సంబంధించిన పెరుగుదల లభిస్తుంది. బంగారం దిగుమతులను తగ్గించడం, నిల్వలను అరికట్టడం, బంగారాన్ని ఆర్థిక ఆస్తులుగా మార్చడం ఈ పథకం ప్రధానంగా లక్ష్యం.
ఈ బాండ్లపై ఎనిమిది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. పెట్టుబడిదారులు కోరుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. ఈ గోల్డ్ బాండ్లలతో స్టాక్ ఎక్స్ఛేంజీలలో పెట్టవచ్చు లేదా ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. వీటితో రుణాలను పొందవచ్చు.
బాండ్ మెచ్యూరిటీకి ఒక నెల ముందు పెట్టుబడిదారులకు రిమైండర్ అందుతుంది. మెచ్యూరిటీ తేదీన పెట్టుబడిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. తమ బ్యాంక్ వివరాలు లేదా ఈ-మెయిల్‌ను మార్చుకున్న వారు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో ముందుగా తమ సమచారాన్ని అప్డేట్ చేసుకోవాలి.
ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లపై వడ్డీ పన్ను లేదు. బాండ్లను రీడీమ్ చేసినప్పుడు లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బాండ్లను ఎక్స్ఛేంజ్‌లో బదిలీ చేయడం వల్ల వచ్చే మూలధన లాభాలు, ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.