Modi Public Meeting: సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూల్ లో జరిగే బహిరంగసభకు ప్రధానీ మోదీ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో సభా ప్రాంగణం పరిసరాల్లో.. విషాద వాతావరణం నెలకొంది.
ప్రధాని మోదీ పాల్గొనే సభ కోసం కర్నూలు జిల్లాలోని నన్నూరు గ్రామ సమీపంలో.. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను అలంకరించేందుకు, పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, కూలీలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్ (28) అనే యువకుడు జెండా కట్టడానికి ఇనుపరాడ్‌ను పైకి ఎత్తుతుండగా, అది అనుకోకుండా సమీపంలోని హై టెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో వెంటనే షాక్ తగిలి అర్జున్ అక్కడికక్కడే నేల కూలిపోయాడు. అతనితో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు.
ఇది గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరాను తక్షణం నిలిపివేసి, గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అర్జున్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Also Read: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్
సభా ప్రాంగణం వద్ద ఇంత పెద్ద స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ, విద్యుత్ తీగల విషయంలో నిర్లక్ష్యం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జెండాలు, ఫ్లెక్సీలు కడుతున్న వారికి విద్యుత్ లైన్ల ప్రమాదం గురించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదని చెబుతున్నారు.