Telangana Bandh: రేపు బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం బంద్ కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు డీజీపీ శివధర్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందిని, నిఘా బృందాలను అప్రమత్తం చేశారు. నిరంతర పర్యవేక్షణ ఉండాలని డీజీపీ ఆదేశించారు.
బీసీ జేఏసీ సంఘం పిలుపునిచ్చిన ఈ బంద్‌కు అన్నీ రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ ప్రజలను కోరింది. ఈ బంద్‌కు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, ఆల్ పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ర్యాలీ జరిగింది. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు.
ALSO READ: EMRS Jobs: 7267 ఉద్యోగాలు బ్రో.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, కొంచెం కష్టపడితే జాబ్ మీదే
ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ వంటి పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ALSO READ: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీజేపీ సైలెంట్ రాజకీయాలకు సంకేతమేంటి..?
ఇదిలా ఉండగా.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి బంద్‌కు సంపూర్ణ మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావుతో పాటు పలువురు జిల్లా, మహిళా విభాగం నాయకులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా.. బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌తో జరుగుతున్న ఈ బంద్ విజయవంతానికి బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు కృషి చేస్తున్నాయి.