Mla Anirudh Reddy: మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా సీఎం అభ్యర్థిని అవుతానని అన్నారు. ఇటీవల అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మంత్రుల జిల్లాలకు, నియోజకవర్గాలకే నిధులు తరలివెళుతున్నాయని ఆరోపిస్తు్న్నారు. తమను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే కదా తాము కూడా మంత్రులు, సీఎం అయ్యేది అన్నారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానన్నారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి సొమ్ము చేసుకున్న వారికి తిరిగి పార్టీలో ప్రవేశం లేదన్నారు. హత్యలు చేసేవారికి కాంగ్రెస్ లో స్థానం ఉండదన్నారు. సొంత సోదరుడినే చంపిన వారు రాజకీయాల కోసం తనను కూడా చంపుతారని సంచలన కామెంట్స్ చేశారు. తనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ… బోర్, డ్రైనేజీ ఇతర పనులు అడుగుతుంటే వారిని చూసి నవ్వుకుంటున్నాం తప్ప, ఏం చేయలేకపోతున్నామన్నారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానన్న ఆయన.. ఇంకో రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం అభ్యర్థి అవుతానన్నారు. తన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి అభిప్రాయమే ఉందన్నారు. అనిరుధ్ రెడ్డి అంటే భోళా, ఏం అడిగినా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అడుగుతాడని సీఎం రేవంత్ అంటుంటారన్నారు.
తాను కూడా సీఎం అభ్యర్థి అవుతానంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతలపైనే కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. ఇటీవల అనిరుధ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీజేపీ సైలెంట్ రాజకీయాలకు సంకేతమేంటి..?