Minister Seethakka: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా ఆయనకు సవాల్ కూడా విసిరారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేబినెట్‌లో రాద్ధాంతం జరగలేదని తల్లిదండ్రులపై ప్రమాణం
తన తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తూ.. నన్ను కన్న సమ్మయ్య- సమ్మక్క సాక్షిగా చెబుతున్నానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని ఆమె తేల్చి చెప్పారు. కేబినెట్‌లో రాద్ధాంతం జరిగిందని హరీష్ రావు నిరూపించగలరా..? అని ఆమె ఛాలెంజ్ చేశారు. క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదని ఆమె ఆమె చెప్పారు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారని.. ఆయన నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రితో తాను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా ఇతర మంత్రుల గురించి చర్చించలేదని సీతక్క తెలిపారు.
ALSO READ: EMRS Jobs: 7267 ఉద్యోగాలు బ్రో.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, కొంచెం కష్టపడితే జాబ్ మీదే
గన్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్..
రాష్ట్రంలో ‘గన్ కల్చర్’ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అని ఆమె ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రోడ్లపై అడ్వకేట్లను హత్య చేశారని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని ‘దండుపాళ్యం, దండుకున్న పాళ్యం’గా ఆమె అభివర్ణించారు. మునుపటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు పరిమితమైతే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని సీతక్క పోల్చి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేబినెట్ సమావేశాలు తూతూ మంత్రంగా జరిగేవని.. కేసీఆర్ బయటికి రాకపోయేవారని ఆమె విమర్శించారు.
హరీష్ రావు ఈ విషయాలపై స్పందించాలి..
చివరగా.. హరీష్ రావుపై కేసీఆర్ కూతురు కవిత అనేక విషయాలను గతంలో బయటపెట్టారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. కవిత చేసిన ఆరోపణలపై హరీష్ రావు ముందుగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ALSO READ: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీజేపీ సైలెంట్ రాజకీయాలకు సంకేతమేంటి..?