Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సై అంటే సై.. ఇటు ప్రచార హోరు.. అటు నామినేషన్ల జోరు.. రణరంగంలో గెలుపు మాదే అంటే మాది.. సానుభూతితో ఒకరు ప్రచారం.. లోకల్ నినాదంతో జెట్ స్పీడ్‌తో మరొకరు ప్రచారం.. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీ ప్రచారం చేస్తుండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఎలాగైనా ఉపఎన్నికల్లో గెలిసి తీరాలని పెద్ద ఎత్తున రెండు పార్టీల నాయకులు ప్రచారం జోరుగా చేస్తున్నారు. అయితే వాస్తవానికి ముందుగా ఈ ఉపఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ సీన్ కట్ చేస్తే త్రిముఖ పోరు అనివార్యమని ఈజీగా తెలిసిపోతుంది. బీజేపీ కూడా పోటీలో ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ ఇప్పుడు ఆ పార్టీ తీరు చూస్తుంటే.. ఆటలో అరటి పండులాగా వ్యవహరిస్తోందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
⦿ బీజేపీలో ఆ జోష్ ఎక్కడా..?
ప్రస్తుత పరిణామాలను క్లియర్ కట్ గా గమనిస్తే.. బీజేపీ మరోసారి రాజకీయంగా వెనుకబడే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రధానంగా.. ఎమ్మెల్యే అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం.. బీజేపీ నాయకత్వంలో ఉప ఎన్నికల గెలుపుపై ఆశ గానీ.. ఉత్సాహం గానీ పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అటు రాష్ట్ర నాయకత్వంలో.. ఇటు క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో గెలుపుపై విశ్వాసం కొరవడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
⦿ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం పెద్ద మైనస్..?
ఈ బలహీనతకు నిదర్శనంగా.. ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. బీజేపీలో పోటీ చేసే సామర్థ్యం గల నాయకుడు లేనట్లుగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను పార్టీలో చేర్చుకుని, బైపోల్‌లో అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సలహా ఇచ్చారు. అరవింద్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ఇది పార్టీ బలహీనతను బయట పెట్టిందని పలువురు జోరుగా మాట్లాడుకుంటున్నారు. అరవింద్ సలహాతో అసలే నిరుత్సాహంగా ఉన్న పార్టీ క్యాడర్ మరింతగా నీరుగారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరకు రెండు రోజుల క్రితం పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కొంత ఆలస్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం వల్ల కూడా బీజేపీ ఉపఎన్నికల పోరులో లేదని బయట ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
⦿ టీడీపీ క్యాడర్ ఎటు వైపు..?
మరోవైపు.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొంత ఆంధ్ర సెటిలిడ్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీకి గట్టి బలమే ఉంది. టీడీపీ మద్దతు తమకు లభిస్తుందని బీజేపీ నాయకత్వం ఆశించింది. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని.. మద్దతు విషయంపై బీజేపీ కోరితే ఆలోచిస్తామని.. లేదంటే తటస్థంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నాయకులను ఆదేశించారు. దీంతో మొదటి నుంచి మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఉన్న టీడీపీ క్యాడర్, ఓటర్లు పార్టీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిణామం బీజేపీ శ్రేణులలో మరింత నిరాశను పెంచిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
⦿ ఎవరిని గెలిపిస్తారు..? రాజాసింగ్ సంచలనం
ఈ నిరుత్సాహం కారణంగా.. బీజేపీ స్థానిక నాయకులు, క్యాడర్ పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నాయకులు తమ అనుచరులతో సహా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మరోవైపు, పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? బీఆర్ఎస్‌ను గెలిపిస్తారా..? లేదా కాంగ్రెస్‌ను గెలిపిస్తారా..? అంటూ ఆయన చురకలు అంటించారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని గుర్తు చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
⦿ అసలు బీజేపీ పాత్ర ఏంటి..?
ధర్మపురి అరవింద్, రాజా సింగ్ వ్యాఖ్యలు పక్కన పెడితే.. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ పాత్ర ఏంటి? వారి వ్యూహం ఏంటిటి? అనే విషయంలో పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న అనుమానాలు మాత్రం పార్టీకి ఓటమి తప్పదనే సంకేతాలు గట్టిగా ఇస్తున్నాయి. మొత్తంగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. బీజేపీ మాత్రం ఆటలో అరటిపండులా వ్యవహరిస్తుందని మాట్లాడుకుంటున్నారు. అంతర్గత సమస్యలు, వ్యూహాత్మక లోపాలతో సతమతమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ALSO READ: BC Reservations: బీసీల బ్లేమ్ బీఆర్ఎస్-బీజేపీల పైనే.. కాంగ్రెస్‌కు క్రెడిట్ రావొద్దనే ఇదంతా..!