తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలకంటే, కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ఎక్కువ ఆసక్తిగా మారాయి. అటు కూతురు, ఇటు కొడుకు ఎవరికీ ఏం చెప్పలేని స్థితిలోకి వెళ్లిపోయారు కేసీఆర్. ఒకరకంగా ఆయన కొడుకు వైపే మొగ్గు చూపుతున్నారనుకోవాలి. ఆయన మనసు తెలుసుకుని కూతురు కూడా మరింత దూరం జరిగింది. పార్టీతో అంటూముట్టనట్టుగానే ఉంది. జాగృతి పేరుతో వేరు కుంపటి పెట్టుకుంది కవిత. ఓ దశలో బీఆర్ఎస్ పై పెత్తనం కోసం ఆమె ఎదురు చూశారు. కానీ కేటీఆర్ పగ్గాలు చేజారకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో కవిత చేసేదేం లేక జాగృతికి మరమ్మతులు చేసుకుంటున్నారు. తాజాగా ఆమె కేటీఆర్ ని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
లీడర్ అంటే ఎవరు..?
జాగృతి రాజకీయ శిక్షణా తరగతులు పేరుతో లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు కవిత. ఈ మీటింగ్ లో ఆమె ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. కనీసం తండ్రి పేరు కూడా ఆమె ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడం ఈ మీటింగ్ హైలైట్. కేసీఆర్ అనే పేరు లేకుండా జాగృతి మీటింగ్ పూర్తి చేసిన కవిత, పరోక్షంగా కేటీఆర్ పై కూడా సెటైర్లు పేల్చారు. ఇంట్లో ఇల్లాలే అసలైన లీడర్ అని చెప్పారు. పుట్టుకతోనే ఎవరూ లీడర్ కాలేరని, లీడర్ షిప్ లక్షణాలతో ఎవరూ పుట్టరని, నేర్చుకుంటూ, మార్చుకునే వారే లీడర్లు అవుతారని చెప్పారు. అంటే కేసీఆర్ కొడుకుగా పుట్టినంత మాత్రాన కేటీఆర్ లీడర్ కాలేరనేది కవిత వ్యాఖ్యల అంతరార్థంగా నెటిజన్లు వివరిస్తున్నారు.
నాకు బాస్ ఆయనే..
బీఆర్ఎస్ తో విభేదించిన తర్వాత కొన్నాళ్లు కవిత పార్టీని, పార్టీ నేతల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో దయ్యాలున్నాయని, అవి తన తండ్రి చుట్టూ చేరి పార్టీని నాశనం చేస్తున్నాయని అన్నారు. కేసీఆరే తనకు బాస్ అని, ఆయన కాకుండా ఇంకెవరూ పార్టీలో తనకు బాస్ లు లేరని చెప్పారు కవిత. అప్పట్లో ఆమె కేటీఆర్ ని పరోక్షంగా దెప్పిపొడిచారు. కేసీఆర్ పే కేసులు పెడుతుంటే పార్టీ నేతలు చూస్తూ ఊరుకున్నారని, కనీసం గట్టిగా నిరసన కార్యక్రమాలు కూడా చేయలేదన్నారు. పార్టీలో ఎవరూ బాస్ లు లేరని, కేసీఆరే బాస్ అని చెప్పుకొచ్చారు కవిత. కానీ ఆమె నమ్మిన బాస్ కూడా ఆమెకు న్యాయం చేయలేదు. ఆమెను పిలిపించి మాట్లాడిన దాఖలావు లేవు. బీఆర్ఎస్ లో ఆమె భవితవ్యం గురించి భరోసా కూడా ఇవ్వలేకపోయారు. దీంతో కవిత జాగృతి పేరుతో హడావిడి చేస్తున్నారు.
గతంలో భారత జాగృతి అన్నారు కానీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ పేరు చేర్చారు. తెలంగాణ జాగృతి పేరుతో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ముఖ్యంగా బీసీలను ఆకర్షిస్తూ రాజకీయం చేయాలనుకుంటున్నారు కవిత. ప్రతి సభలో సమావేశంలో పూలేవాదం తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ పేరుని కూడా ఆమె ప్రస్తావించకుండా జాగ్రత్తపడుతున్నారు. జాగృతిని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కవిత. ఈ దశలో కేటీఆర్ కి ఆమె ప్రత్యర్థిగా మారాడనడంలో అతిశయోక్తి లేదు.