మయన్మార్ భూకంపం ఎంత భయంకరంగా ఉందో మనం చూశాం. అయితే అందరూ భూకంపం తర్వాత జరిగిన విలయాన్ని చూశారు. భూకంపం జరిగే సమయంలో కొంత సీసీ టీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. పెద్ద పెద్ద భవనాలపై ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు బయటకు చిమ్మింది. నిర్మాణంలో ఉన్న కొన్ని భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంతో పాటు ఓచోట భూమి నిట్టనిలువునా చీలిపోయిన దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే భూమి చీలిపోయే సమయంలో రికార్డ్ అయిన ఓ సీసీ టీవీ ఫుటేజీ ఇప్పుడు వైరల్ గా మారింది.
1.3 సెకన్లలో..
కేవలం 1.3 సెకన్లలో 2.5 మీటర్ల పొడవున భూమి నిట్టనిలువునా చీలిపోయిన దృశ్యం అది. మార్చి 28న జరిగిన మయన్మార్ భూకంప తీవ్రతకు అది అద్దంపడుతోంది. గతంలో భూమి చీలిపోతున్న దృశ్యాలను ఎప్పుడూ సీసీ కెమెరాలు క్యాప్చర్ చేయలేదని అంటున్నారు. తొలిసారిగా భూమి చీలిపోతున్న సమయంలో ఆ వీడియో రికార్డ్ అయింది. అది కూడా కేవలం 1.3 సెకన్లలో జరిగిపోయింది. అంటే మనం కన్నుమూసి తెరిచేలోపే భూమి నిట్టనిలువుగా చీలిపోయిందనమాట. ఓ ఇంటిలో ఉంచిన సీసీ కెమెరా దీన్ని రికార్డ్ చేసింది. భూకంపంలో భూమి చీలిపోయిన వేగం సెకనుకి 3.2 మీటర్లుగా ఉన్నట్టు నిర్థారించారు. ఆ వేగంతో భూమి చీలిపోతే.. అక్కడ ఉన్నవారు షాక్ కి గురవుతారు. మయన్మార్ భూకంపం అత్యంత భయంకరంగా ఉంది అని చెప్పడానికి ఈ వీడియోనే పెద్ద ఉదాహరణ అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా భూమి చీలిపోయే వీడియోలు బయటకు రాలేదు. భూమి రెండుగా విడిపోయిన తర్వాత అక్కడకు వెళ్లిన వారు వీడియోలు తీశారు కానీ, భూమి విడిపోతున్నప్పుడు ఎవరూ దాన్ని వీడియో తీయలేదు, సీసీ ఫుటేజీ కూడా లభ్యం కాలేదు. కానీ తొలిసారిగా మయన్మార్ భూకంపం విషయంలో అరుదైన వీడియో రికార్డ్ అయింది.
వేగంగా చీలిపోయిన భూమి..
ముందుగా ఆ కెమెరాలో ఓ గేట్ కనపడుతోంది. భూకంప సమయంలో గేట్ విడిపోయింది. ఆ తర్వాత గేట్ ముందు ఉన్న భూమిపై పగుళ్లు కనపడ్డాయి. ఆ పగుళ్లు కూడా కేవలం 1.3 సెకన్లలో పూర్తయ్యాయి. భూకంపం సమయంలో భూమి అత్యంత వేగంగా చీలిపోతుందని శాస్త్రవేత్తలు ఓ నిర్థారణకు వచ్చారు. గతంలో భూకంపం విషయంలో వారికి కొన్ని అనుమానాలు ఉండేవి. భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు మెల్ల మెల్లగా సర్దుబాట్లకు గురవుతాయని, అప్పుడు భూమి మెల్లిగా రెండుగా చీలిపోతుందని అనుకునేవారు. కానీ ఆ చీలిక అనేది అత్యంత వేగంగా జరుగుతుందని ఇప్పుడు తెలిసింది. భూకంప సమయంలో భూమి చీలిన సమయాన్ని బట్టి దాని తీవ్రత కూడా అంచనా వేయొచ్చని అంటున్నారు.
ఆసక్తికర పరిశోధనలు
రాబోయే రోజుల్లో భూకంపాలపై జరిగే అధ్యయనంలో ఇది మేలి మలుపు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే భూకంపాల విషయంలో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి వాటి తీవ్రతను తట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. భూకంపాన్ని మనం ఆపలేం కానీ, నష్టాన్ని తగ్గించేందుకే శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. భూకంపం గురించిన నిర్దిష్ట సమాచారం ముందుగా తెలిస్తే కనీసం ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. స్మార్ట్ ఫోన్ల సాయంలో భూకంపం వచ్చే సమయాన్ని ముందుగా అంచనా వేస్తున్నారు. తాజాగా బయటపడిన సీసీ టీవీ ఫుటేజీతో భూకంపాల విషయంలో మరిన్ని ఆసక్తికర ప్రయోగాలు చేయవచ్చని తెలుస్తోంది.