Kavitha: తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఎందుకు బీఆర్ఎస్ నేతల అవినీతిపై టార్గెట్ చేశారు? అందుకు కారణాలు చాలానే ఉన్నాయా? ఆమె అరెస్టుకు ముందు ఏం జరిగింది? తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె కలత చెందారా? ఈ క్రమంలో పార్టీ నుంచి బయటకు వచ్చారా? ఆనాడే రాజీనామాను ఎందుకు వద్దన్నారు? ఇలాంటి అంశాలపై ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత.
బీఆర్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన కవిత
తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కవిత ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. జాగృతి సంస్థ ఏర్పాటుకు ముందు, బతుకమ్మ, బోనాలు పండుగలు పార్టీ సమావేశాల్లో చేరేవారని గుర్తు చేశారు. ఒక వేడుకలా చేసిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థకు చెందుతుందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
2014లో ఎంపీ టికెట్ పిలిచి ఇచ్చారని, తాను వెళ్లి అడిగిన సందర్భం పార్టీలో లేదన్నారు. తనతో పని చేస్తున్న కార్యకర్తలు ఇప్పుడు అలాగే ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ అధికారంలోని ఉన్న పదేళ్లు జాగృతి కార్యకర్తలు చాలా దారుణంగా చూసేవారని గుర్తు చేశారు. ఎక్కడికి వెళ్లినా తమను దూరం పెట్టేవారని, బీఆర్ఎస్‌తో మీకు ఏం సంబంధమంటూ అనేవారని వివరించారు.
ఆనాడు మా పరిస్థితి అదే, ఆరోజు ఇదే జరిగింది?
అదే సమయంలో చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 2023 ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ప్రధానంగా చెప్పారు. అభ్యర్థులను మార్చకపోవడం ఒకటైతే.. నిరుద్యోగుల సమస్య అత్యంత కీలకమైందన్నారు. వీటివల్ల బీఆర్ఎస్ ఓటమి పాలైందని ప్రతీ ఒక్కరూ చెబుతారని అన్నారు. 30 మంది అభ్యర్థులను మార్చాలని చెప్పినా, ఏ మాత్రం పార్టీ పట్టించుకోలేదన్నారు.
లిక్కర్ విషయంలో తన వ్యవహారం గురించి మూడేళ్లుగా కేసీఆర్, కేటీఆర్ వద్ద చెప్పానని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వారి నాయకులను అరెస్టు చేసినా, కేసులు పెట్టినా వారి కార్యకర్తలు గోల గోల చేశారని అన్నారు. ఛార్జిషీటు దాఖలు చేసినా ఆనాడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదని, కేసులు పెట్టినా కనీసం నోరు మెదపలేదన్నారు. ఈ విషయంలో పార్టీని పదే పదే కోరినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.
తాను అరెస్టు అవుతానని తన తండ్రి కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు కవిత. పార్టీకి రిజైన్ చేయమంటారా? అని అడిగానని వివరించారు. తనను అరెస్టు చేస్తారన్న విషయం గురించి మీడియా సమావేశంలో చెబితే బాగుంటుందని చెప్పానని తెలిపారు. ఆ విషయాలు తప్పితే తన తండ్రి ఎలాంటి అంశాలు ప్రస్తావించలేదన్నారు.
ALSO READ: అఖిలేష్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?
రెండు రోజుల తర్వాత పెడతామని కేసీఆర్ అన్నారని, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదన్నారు. ఆ విషయాన్ని మళ్లీ అడగానని తెలిపారు. కనీసం రామన్నతోనైనా సమావేశం పెట్టించాలని అడిగినట్టు తెలిపారు. మూడేళ్లుగా తాను జైలుకి వెళ్తానని తెలిసి ఏనాడు బీఆర్ఎస్ సపోర్టుగా మాట్లాడలేదన్నారు. జైలుకి వెళ్లిన తర్వాత ఆ ఇష్యూని హైలైట్ చేసే పనిలో పడ్డారన్నారు.
తనను తొలి నుంచి డిఫెండ్ చేస్తే బాగుండేదని, ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కుండబద్దలు కొట్టేశారు. తాను అడుక్కునే పర్సన్ కాదని, కొట్లాడేతత్వం తనదని అన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ తనకు ఉంటుందన్నారు. రెండుసార్లు అడిగినా ప్రెస్ మీట్ పెట్టలేదంటే, పొలిటికల్‌గా కాస్త అనుభవం ఉన్నవారికి ఇష్టంలేదని తాను భావించినట్టు తెలిపారు. అరెస్టు రోజు ఎయిర్‌పోర్టుకు తన భర్త, జాగృతి కార్యకర్తలు మాత్రమే వచ్చారన్నారు.