బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్ లో స్వయంగా కారు డ్రైవింగ్ చేశారు. కేసీఆర్ డ్రైవింగ్ చేస్తుండగా ఎమ్మెల్యే పటోళ్ల కార్తీక్ రెడ్డి పక్కన కూర్చుకున్నారు. వీరిద్దరూ కలిసి ఫామ్ హౌస్ లో పంట పొలాలను పరిశీలించారు. అధికారం కోల్పోయిన తరవాత మాజీ సీఎం ఫామ్ హౌస్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తరవాత కొద్దిరోజులకే ఆయన బాత్రూంలో జారిపడగా కాలికి గాయమైంది. అప్పటి నుండి ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆ తరవాత కొంత కాలానికి ఎంపీ ఎన్నికలు రాగా ప్రచారంలో పాల్గొన్నారు.
Also read: మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో, రైతుల రుణమాఫీ, 25 లక్షల ఉద్యోగాలు..
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కసీటు కూడా రాలేదు. ఆ తరవాత కేసీఆర్ బయట కనిపించడమే గగనం అయిపోయింది. దీంతో అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇక ఆయన బయటకు రాలేరని ప్రచారం జరిగింది. అప్పుడప్పుడూ కార్యకర్తలతో ఫామ్ హౌస్ లో సమావేశమైన కేసీఆర్ కొంత కాలం తరవాత అది కూడా మానేశారు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ కేసీఆర్ ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు కారు నడిపి తాను బానే ఉన్నానని సంకేతం ఇచ్చారు.
గతంలోనూ ఇలాంటి వార్తలే రావడంతో కాలు గాయం నుండి కోలుకున్న తరవాత ఓమ్నీ వ్యాన్ నడిపి తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వం మారిన తరవాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టిందే లేదు. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్నారు కానీ అసెంబ్లీకి మాత్రం రాలేదు. ప్రజలకు బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చిందే ప్రజా సమస్యలపై మాట్లాడటానికి. కానీ ఆయన బయటకు రాకపోవడం ఆ పార్టీకి మరింత నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ కారు నడుపుతున్నట్టు ఫోటోలు వైరల్ అవ్వడంతో..కారు భలే నడిపారు మరి అసెంబ్లీకి ఎందుకు రారు సారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.