KCR : కర్ర విరక్కుండా, పాము చావకుండా.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఈటల రాజేందర్. అంతా నిజమే చెబుతానని.. పీసీ ఘోష్ ముందు ప్రమాణం చేసి.. కాళేశ్వరం కమిషన్ ముందు స్ట్రాటజిక్‌గా మాట్లాడారని అంటున్నారు. కేసీఆర్‌ను పూర్తిగా ఇరికించేయలేదు.. అలాగని సేవ్ కూడా చేయలేదని చర్చించుకుంటున్నారు. 40 నిమిషాలు.. 19 ప్రశ్నలు.. చెప్పాల్సింది చెప్పి వచ్చేశారు. కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ గులాబీ బాస్‌కు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే, నిధుల వ్యవహారం తనకు తెలీదని అంతా కేసీఆర్, హరీష్‌రావులే చూసుకున్నారంటూ చెప్పడంతో ఆ ఇద్దరిలో కంగారు మొదలైంది.
కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్
ఈటల విచారణ ముగియడంతో.. అర్జెంటుగా ఫాంహౌజ్‌లో హరీష్‌రావుతో మీటింగ్ పెట్టారు కేసీఆర్. లీగల్ టీమ్‌తో పాటు కమిషన్ ముందు హాజరైన మాజీ ఇంజినీర్లతోనూ భేటీ అయ్యారు. విచారణలో ఏమేమి ప్రశ్నలు అడిగారన్న దానిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు తాను వర్చువల్‌గా హాజరయ్యే అవకాశంపై లీగల్ టీమ్‌తో చర్చలు జరుపుతున్నారు. తాను చెప్పదలుచుకున్న సమాచారంతో 3వేల పేజీల అఫిడవిట్ తయారు చేయించారని తెలుస్తోంది. కమిషన్‌కు అఫిడవిట్‌తో సమాధానం చెప్పాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్‌లోనే ఈటల!
మరోవైపు, ఈటల స్టేట్‌మెంట్‌ను టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఈటల వివరణ చూస్తే కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు తెలుస్తుందన్నారు. తాను ఇప్పటికే ఆరోపించినట్టు ఈటలను హరీష్‌రావు కలిసిన మాట నిజమేనని తేలిపోయిందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ తప్పేమీ లేదని, కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఈటల అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి.. ప్రాజెక్ట్ నిధులతో తనకు ఏ సంబంధం లేదనడం హాస్యాస్పదం అన్నారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద అవినీతి జరిగింది కోడై కూస్తుంతే ఈటల మాత్రం ఏం జరగలేదన్నట్లు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వాటాలు ముట్టినందుకే కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఈటల మాటలు చూస్తుంటే ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. బీజేపీతో జరిగిన లోపాయికార ఒప్పందం మేరకే ఈటల కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నరని ఆరోపించారు.
అవన్నీ కాళేశ్వరం పైసలే..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కల్వకుంట్ల కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు మహబూబ్‌నగర్ MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి. 2018 నుంచి 2023 వరకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో BRSకు వచ్చిన 14 వందల కోట్లు.. కాళేశ్వరంలో భాగమేనని అన్నారాయన. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లబ్ది పొందిన వారే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పైసలు పంపించారని యెన్నం ఆరోపించారు.