విజయ్ మాల్యా. ఆ పేరు చెబితేనే అతనో పెద్ద ఆర్థిక మోసగాడు అంటారు అందరూ. భారత్ నుంచి పారిపోయి ప్రవాసంలో బతుకుకున్న కొంతమంది ఆర్థిక నేరగాళ్లలో మాల్యా కూడా ఒకరు. అయితే విజయ్ మాల్యా జీవితం అంతకు మించి వేరే ఉంది. అతనికి ప్లేబోయ్ ఇమేజ్ ఉంది. జీవితాన్ని ఎంత విలాసంగా గడపాలో అంతకంటే ఎక్కువగానే గడిపాడు. విలాసవంతమైన వస్తువుల సేకరణ అంటే అతనికి పిచ్చి. దానికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు. చివరకు బిజినెస్ తక్కువై లగ్జరీ ఎక్కువై అప్పులపాలయ్యాడు. ఆ అప్పుల్ని ఎగ్గొట్టేందుకు తిప్పలు పడ్డాడు. చివరకు బ్రిటన్ కి పారిపోయి ప్రవాస జీవితం గడుపుతున్నాడు. అలాంటి విజయ్ మాల్యా తాజాగా ఓ ఇంటర్వ్యూతో మరోసారి వెలుగులోకి వచ్చాడు. తాను దొంగని కాదని, బాధితుడినని చెప్పుకుంటున్నాడు. ఆ మాటల్ని ప్రజలు విశ్వసిస్తారా, బ్యాంకులు నమ్ముతాయా, పోలీసులు జాలి చూపిస్తారా..? అనే విషయాల్ని పక్కనపెడితే తన ఇష్టాయిష్టాలపై ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు మాల్యా. అందులో తెలంగాణ, హైదరాబాద్ అనే పేర్లు కూడా మాల్యా ప్రస్తావించడం విశేషం.
వింటేజ్ కార్ల పిచ్చి..
విజయ్ మాల్యాకు కార్ల పిచ్చి. ఆ పిచ్చి ఉన్నవాళ్లు కొత్త మోడల్ ఏది రిలీజైతే అది కొంటుంటారు. లగ్జరీ కార్లను తమ సెలక్షన్లో పెట్టుకుంటారు. కానీ మాల్యాకు అంతకు మించిన పిచ్చి ఉంది. అది వింటేజ్ కార్ల సెలక్షన్. ఆ పిచ్చి ఉన్నవాళ్లు కొత్త కార్ల గురించి ఆలోచిస్తూనే, పాత కార్లు ఎక్కడ దొరుకుతాయా అని వెదుకుతుంటారు. తన టీమ్ కి చెప్పి మరీ వెదికిస్తుంటారు. అలా విజయ్ మాల్యా తెలంగాణ నుంచి రెండు కార్లు తీసుకెళ్లాడు. అందులో ఒకటి నిజాం వాడిన రోల్స్ రాయిస్ కారు.
నిజాం వాడిన కారు..
మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ కార్లు ఏవి అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు విజయ్ మాల్యా ఆసక్తికర సమాధానం చెప్పారు. తాను మెచ్చిన మూడు కార్లలో ఒకటి నిజాం వాడిన రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ కారు. అది ఇంకా వాడుకలోనే ఉందని చెప్పాడు మాల్యా. ఆ కారు అంటే తనకి చాలా ఇష్టమని అన్నాడు. ఆ కారుతోపాటు మరో రెండు కార్లు కూడా తనకు ఫేవరెట్ అన్నాడు.
బంగారు హుండీ..
బంగారు హుండీని చిల్ల వేసుకోడానికి వాడుతున్నారంటూ.. కేజీఎఫ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటి డైలాగే కొట్టారు మాల్యా. హైదరాబాద్ లో అలాంటి ఓ కార్ ని మాల్యా జస్ట్ 50వేల రూపాయలకే కొన్నాడట. ఆ కారుని ఓ వ్యక్తి తన ఇంటి వెనక చెత్త కుప్పల మధ్య పెట్టేశాడు. ఆ కారులో నుంచి ఓ చెట్టు కూడా పెరిగిందట. అలాంటి కారు గురించి తన టీమ్ చెబితే వెంటనే దాన్ని కొనేశానని అన్నాడు మాల్యా. ఇంజిన్ సహా ఆ కారుకి అన్నీ సమకూర్చి దాన్ని రన్నింగ్ కండిషన్ లోకి తెచ్చానంటున్నాడు. అది కూడా రోల్స్ రాయిస్ కారు కావడం విశేషం.
1920, 30ల్లో భారత్ లో ఎక్కువమంది రాజవంశీకులు కార్లు కొనేవారు. అవి కూడా అలాంటిలాంటివి కాదు. పేరు గొప్ప కంపెనీలవి. ముఖ్యంగా రోల్స్ రాయిస్ అందులో కచ్చితంగా ఉంటుంది. వారు వాడిన కార్లు ఇప్పుడు మూలన పడిపోయి ఉంటాయని, వాటి విలువ ఎవరికీ తెలియదని, అందుకే వాటిని రిపేర్ చేయకుండా అలా పడేస్తుంటారని, వాటిని రక్షించడం తనకు ఇష్టమని చెప్పాడు విజయ్ మాల్యా. మాల్యా కూడా రాయల్ లైఫ్ లీడ్ చేయాలని అనుకునేవారు. అందుకే రాజులు వాడిన కార్లని ఏరికోరి తన వింటేజ్ సెలక్షన్లో పెట్టుకున్నాడు. కేవలం సెలక్ట్ చేయడమే కాదు, వాటిని వినియోగించడానికి వీలుగా రిపేర్లు చేయించేవాడు. వాటితో విదేశాల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించాడు మాల్యా.