మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్‌కు వచ్చి రాష్ట్ర కార్యవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి, సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో సర్కారుపై ఎలా ఫైట్ చేయాలి? ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో వారికి దిశానిర్దేశం చేశారు. 15 రోజుల్లో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించి కృష్ణా నదీ జలాలపై రేవంత్ సర్కార్ అవలంభిస్తున్న తీరును ఎండగడతామని అన్నారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు సైతం గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో దోచుకో దాచుకో అన్నట్టుగా పాలన సాగిందని, రియల్ ఎస్టేట్ మొదలు, ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.రాష్ట్రం అప్పుల కుప్పగా మారడానికి, కాళేశ్వరం కూలిపోవడానికి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా కాలయాపన ఆయన హయాంలోనే జరిగిందని విమర్శించారు. తాజాగా సీఎం రేవంత్ నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ మీద విరుచుకపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనపై లేనిపోని ఆరోపణలు చేసి వందల కేసులు పెట్టారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అయినా తాను అధికారంలోకి వచ్చాక రివేంజ్ పాలిటిక్స్ చేయలేదని గుర్తుచేశారు. సీఎం అయ్యాక ఆలోచించానని, ఇప్పుడు ఆయన మీద రివేంజ్ తీసుకుంటే తనకు ఏమి వస్తుందని, ఎవరి పాపన వారే పోతారని వదిలేసినట్టు పేర్కొన్నారు. దేవుడు ఉన్నాడని.. తాను సీఎం అయిన కొద్దిరోజుల్లోనే కేసీఆర్ కిందపడటంతో మక్కిలిరిగాయని అన్నారు. ఆయన్ను జైలులో పెట్టడం ఎంత సేపని, కానీ ఆ పని చేయలేదన్నారు.ఎందుకంటే ఇప్పుడున్నది ఆయన ఉన్న ఫాంహౌస్ కూడా జైలు వంటిదే అని విమర్శించారు.
తన చుట్టూ ఉన్న వారంతా తనపోలీసులే అని గుర్తుచేశారు. ఆయన్ను జైలులో పెడితే మళ్లీ ప్రభుత్వానికి వృథా ఖర్చు తప్పితే ఏమీ లేదన్నారు. 2029లోనూ తమ ప్రభుత్వమే వస్తుందని, దమ్ముంటే ఆపాలని సీఎం రేవంత్.. గులాబీ అధినేతకు సవాల్ విసిరారు. ఇంతకాలం ఆయన్ను ఏమీ అనొద్దని ఊరుకుంటే తమ ప్రభుత్వం మీద పిచ్చివాగుడు వాగుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తే అసెంబ్లీకి వచ్చి చర్చ జరపాలన్నారు. నదీ జలాలపై చర్చకు రావాలని పిలిచారు. అసెంబ్లీకి రాకుండా గతంలో జరిగిన తప్పులను తాము చేసినట్టు చిత్రీకరించడం ఏంటని నిలదీశారు. త్వరలోనే బీఆర్ఎస్ పని ఖతం అవుతుందని, అధికారం వారికి ఇక గతమే అని స్పష్టంచేశారు. అధికారం దూరమై, కన్నబిడ్డ కూడా దూరమైందని, ఆరోగ్య సమస్యలతో ఫౌంహౌస్‌లోనే శిక్ష అనుభవిస్తున్న ఆయన్ను మళ్లీ తాను ఏమి శిక్షించాలని చెప్పారు. కేసీఆర్, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్దాన్ని చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు త్వరలోనే సంభవించనున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.