Mood Kishan Naik: ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం.. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప.. ఇలాంటి వార్తలు వారానికో, నెలకో చూస్తూనే ఉంటాం. మరి.. ఆ అవినీతి తిమింగలాలు, చేపలన్నీ ఎక్కడికి పోతున్నాయ్? వాటిని ఏం చేస్తున్నారు? పట్టుబడినప్పుడు మాత్రమే కనిపిస్తున్న వాళ్లు.. తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? కేసులు నమోదు చేసినంత మాత్రాన.. శిక్షలు పడుతున్నాయా? ప్రతి సంవత్సరం.. అవినీతి కేసులు పెరగడానికి కారణమేంటి? ఇలా.. ఎన్నో ప్రశ్నలున్నాయ్. కానీ.. ఏసీబీ కేసులున్నా నో ప్రాబ్లమ్.. సర్కార్ ఉద్యోగానికి ఢోకా లేదనే ధీమా ఎక్కడి నుంచి వస్తోంది? ఇదీ వరస.. లంచగొండి అధికారులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవినీతి సొమ్ముతో.. కోట్ల ఆస్తుల్ని వెనకేసుకున్న అధికారి.. ఇంత ధీమాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? లంచం తీసుకుంటే శిక్షపడుతుందనే భయం లేదు! కేసు నమోదైతే ఉద్యోగం పోతుందన్న ఆలోచన లేదు! కరప్టెడ్ ఆఫీసర్లు ఏసీబీని ఎప్పుడో లైట్ తీసుకున్నారా?
పరిస్థితులు చూస్తుంటే.. మూడ్ కిషన్ లాంటి లంచగొండి అధికారుల తీరు కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటే.. అదే అనిపిస్తోంది. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. బయటపడేందుకు మా దారులు మాకున్నాయ్ అన్నట్లుగా ఉంది యవ్వారం. లంచాలకు మరిగి.. అక్రమ ఆస్తులను కూడబెట్టడంలో ఆరితేరిన రవాణాశాఖ మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్.. ఏసీబీకి చిక్కారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఆయన ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి నగదు, నగలతో పాటు అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కిషన్ బంధువులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో మొత్తం 12 కోట్ల 72 లక్షల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయ్. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడటం ఇదే తొలిసారి. ఆ మధ్య ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా.. వాటన్నింటి కంటే కిషన్ ఆస్తిపాస్తులే ఎక్కువ అంటున్నారు. సోదాలు ముగిసిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. కిషన్‍ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఏపీలోనూ చాలా మంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. అక్రమ వసూళ్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కేంద్రంగా మారాయ్. అందులో పనిచేసే ఉద్యోగుల తరఫున లంచాలు వసూలు చేసే ప్రైవేట్ వ్యక్తులపైనా ఏసీబీ ఫోకస్ పెట్టింది. వారి నివాసాల్లో సోదాలు చేసి.. భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఆస్తిపత్రాలతో పాటు నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం.. ఇలా అన్ని నగరాలు, పట్టణాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. గత నవంబర్‌లోనూ.. 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి.. భారీ మొత్తాల్లో లెక్కల్లో చూపని నగదుని పట్టుకున్నారు. అక్రమ వసూళ్ల కోసం ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నట్లు గుర్తించారు. ఆ తనిఖీల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా నాలుగు కేసులు నమోదుచేసి.. అధికారులు, ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో.. తాజాగా మరోసారి సోదాలు చేపట్టారు. ఇవి ఇంకా కొనసాగుతున్నాయ్.
సాధారణంగా ఏసీబీ రైడ్స్ జరిగినప్పుడు కనిపించే సోదాల హడావుడి, అరెస్టులు చూసి.. జనమంతా ఇక వీడి పనైపోయింది అనుకుంటారు. కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, ఎకరాలకు ఎకరాల భూములు, భవనాలు బయటపడినప్పుడు.. సామాన్య ప్రజలకు ఒకరకమైన కసి తీరినట్లు అనిపిస్తోంది. కానీ.. ఆ తర్వాత ఏమవుతుందో ఎవ్వరూ పట్టించుకోరు. ఈ అవినీతి చేపలు, తిమింగలాలు.. ఏ సముద్రంలోకి వెళ్తున్నాయ్? పట్టుబడిన అధికారులు మళ్లీ కుర్చీల్లో ఎలా కూర్చుకుంటున్నారు? అనే దానిమీదే తీవ్ర చర్చ నడుస్తోంది. వ్యవస్థలోని లొసుగులను, విచారణలో ఆలస్యాలను, రాజకీయ అండదండల వెనుక ఎన్నో చేదు నిజాలున్నాయ్. ఏసీబీకి పట్టుబడటం ఒక ఎత్తైతే.. తర్వాత ఆ అవినీతి అధికారికి శిక్షపడటం మరో ఎత్తు. ఏసీబీ.. ఒక అధికారిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా, ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించినప్పుడైనా.. వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపుతారు. కానీ.. అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఏసీబీ ఒక అధికారిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటే.. ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ పర్మిషన్ రావాలి. ఈ అనుమతి రావడానికే.. ఏళ్లకేళ్లు సమయం పడుతోంది. రికార్డుల ప్రకారం.. తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో నమోదైన 600లకు పైగా కేసుల్లో.. దాదాపు 80 శాతం కేసులు.. కేవలం ఈ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోసమే.. సెక్రటేరియట్‌లో పెండింగ్‌లో ఉన్నాయ్.
ఇక.. ఈ ఏసీబీ కేసుల విషయంలో.. ప్రభుత్వం కొన్నిసార్లు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకుండా, కేవలం శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తుంది. ఇది శిక్షను నీరుగార్చడమేనన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అలా.. ఈ విచారణలు దశాబ్దాల పాటు సాగుతూనే ఉంటాయి. ఒక అవినీతి అధికారి.. ఏసీబీకి దొరికితే వెంటనే సస్పెండ్ చేస్తారు. కానీ.. ఈ సస్పెన్షన్ జీవితకాలం ఉండదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం.. ఒక ఉద్యోగిని రెండేళ్లకు మించి సస్పెన్షన్‌లో ఉంచకూడదు. కొన్ని రాష్ట్రాల్లో దీనిని ఏడాదికి తగ్గించారు. ఈలోపు విచారణ పూర్తి కాకపోతే.. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోవాలనే నిబంధన ఉంది. విచిత్రం ఏమిటంటే.. అవినీతి కేసులో పట్టుబడిన వ్యక్తి.. మళ్లీ అదే శాఖలో గానీ, మరో కీలకమైన పోస్టింగ్‌లో గానీ చేరిపోతున్నారు. అలా.. విచారణ పెండింగ్‌లో ఉన్నంతకాలం.. అతన్ని నిర్దోషిగానే పరిగణించి ప్రమోషన్లు కూడా ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయ్. వ్యవస్థ ఇలా ఉన్నందువల్లే.. అవినీతి అధికారుల్లో భయం లేకుండా పోతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
ప్రతి సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో వందలమంది లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకుంటోంది. ఆదాయానికి మించి ఆస్తులున్న అవినీతి అధికారులను కూడా అరెస్ట్ చేస్తోంది. కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతున్నా సరే.. కరప్టెడ్ ఆఫీసర్లందరికీ తగిన శిక్ష పడట్లేదు. పైగా.. ఏటికేడు అవినీతి కేసులు పెరిగిపోతున్నాయో తప్ప.. అస్సలు తగ్గట్లేదు. మరి.. అవినీతి అధికారుల్లో భయం పుట్టాలంటే.. ఏం చేయాలి? లంచం తీసుకోవాలంటేనే వణికిపోవాలంటే.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి?
లంచం తీసుకుంటాం.. ఏసీబీకి దొరికితే.. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉంటాం.. తర్వాత కుర్చీలో కూర్చుంటాం.. మళ్లీ లంచాలు తింటాం అన్నట్లుగా ఉంది అవినీతి అధికారుల ధోరణి. గడిచిన ఐదేళ్లలో.. తెలంగాణ ఏసీబీ 621 కేసులు నమోదు చేసింది. అంటే.. ప్రతి ఏటా 120 కేసులు ఫైల్ అయ్యాయ్. ఈ కేసుల్లో ఏసీబీ అధికారులు విచారణ పూర్తి చేసి.. ఆ అధికారిని కోర్టులో ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తుంది. కానీ.. సెక్రటేరియట్‌లో ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వడానికే తక్కువలో తక్కువ ఏడాది సమయం పడుతోంది. అంతేకాదు.. ఏసీబీ అడిగిన అన్ని కేసుల్లో.. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వరు. సచివాలయంలో రకరకాల పైరవీలతో.. కేవలం 25 శాతం కేసుల్లో మాత్రమే ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇస్తారు. మిగతా కేసులు శాఖాపరమైన విచారణ అని గానీ, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ లాంటి వాటికి పంపడం, అక్కడ ఆ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పడటంతో.. చివరికి ఎలాంటి చర్యలు లేకుండానే ముగిసిపోతాయ్. మరో షాకింగ్ ఎలిమెంట్ ఏమిటంటే.. ఏసీబీ కోర్టులో వేసిన కేసులు సంవత్సరాల తరబడి అలా సాగుతూ ఉంటాయ్. ఏడాదికి.. కేవలం 20 నుంచి 25 కేసుల్లోనే తీర్పులు వస్తున్నాయ్. 2023-24 సంవత్సరంలో 19 పాత కేసుల‌్లో తీర్పు రాగా.. అందులో 9 కేసుల‌్లోని అవినీతి అధికారులకు శిక్షపడింది. 10 కేసుల్లోని అధికారులను నిర్దోషులుగా విడుదల చేశారు. 2024-25 సంవత్సరంలో.. 22 కేసుల్లో తీర్పు చెప్పగా.. 12 కేసుల్లోనే శిక్షపడింది. మరో 10 కేసుల్లో నిర్దోషిగా తేల్చారు. అంటే.. ఏసీబీ కేసుల్లో 50 శాతం వాటికే శిక్షలు పడుతున్నాయ్.
2024-25లో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ 417 ఏసీబీ కేసులు నమోదయ్యాయ్. ఇందులో.. 120 కేసులు 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల మీదే ఉన్నాయి. తరచుగా నమోదవుతున్న ఏసీబీ కేసులను బట్టి చూస్తే.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోంది. కానీ.. ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేకుండా పోయింది. సబ్ చల్తా హై అన్న వాతావరణం నెలకొంది. పైగా.. వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతుండటంతో.. లంచగొండి అధికారులు ముందే జాగ్రత్తపడుతున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు, బంగారాన్ని వేరే చోట దాచేస్తున్నారు. డీటీసీ కిషన్ కేసులో ఇదే జరిగింది. సోదాల్లో.. ఆస్తుల పత్రాలేవీ దొరకకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్ సెల్‌ఫోన్‌లో.. బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ డాక్యుమెంట్ దొరికింది. అది.. సికింద్రాబాద్‌లోని ఓ దుకాణానికి సంబంధించింది. కిషన్ ముందు రోజే తన దగ్గరున్న బంగారు నగల్ని.. ఆ దుకాణంలో పెట్టారని ఆ వ్యాపారి చెప్పారు. ముందురోజు రాత్రే.. ఓ బంధువు ఇంటికి వెళ్లి.. ఆస్తుల పత్రాలను అప్పగించినట్లు విచారణలో తేలింది.
ఏసీబీ కేసుల విషయంలో అవినీతి అధికారుల్లో భయం లేకపోవడానికి కారణం.. శిక్షలు ఆలస్యం కావడమే. ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కి అనుమతి ఇచ్చి.. కేసు కోర్టుకు వెళ్లినా.. తీర్పు వచ్చేందుకు 10 నుంచి 15 ఏళ్లు పడుతోంది. పదేళ్లు గడిచేసరికి.. సాక్షులు నిందితుల ఒత్తిడికి లొంగిపోయి తమ స్టేట్‌మెంట్ మార్చుకుంటున్నారు. అంతేకాదు.. ఏసీబీ కేసుల్లో కన్విక్షన్ రేటు చాలా తక్కువగా ఉంటోంది. అనేక ఏళ్ల పోరాటం తర్వాత.. 15 నుంచి 20 శాతం కేసుల్లో మాత్రమే దోషులుగా లేలుతున్నారు. మిగతా వాళ్లంతే.. టెక్నికల్ రీజన్స్‌తో బయటపడుతున్నారు. ఏసీబీ కేసులున్నా నో ప్రాబ్లమ్ అనే ధీమా పెరగడానికి అనేక కారణాలున్నాయ్. ఒకసారి దొరికినా బెయిల్ వస్తుంది.. తర్వాత ఉద్యోగం వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. రాజకీయ నేతల అండదండలతో.. పైరవీలు చేసుకొని కేసులు మూలనపడేలా చేస్తున్నారు. ఇక.. కేసు తేలేసరికి ఆ అవినీతి అధికారి రిటైర్ అయిపోతాడు. చివరికి.. పెన్షన్, ఇతర ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ పాలనలో అవినీతి తగ్గాలన్నా, ఏసీబీ దాడులు, కేసులు కేవలం హెచ్చరికలుగా మిగిలిపోకూడదన్నా.. కఠిన చర్యలు తీసుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నప్పుడే.. ఆ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కఠిన చట్టాలు ఉండాలి. ఏసీబీకి ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడానికి.. ప్రభుత్వానికి గరిష్టంగా నెలరోజుల గడువు మాత్రమే ఉండాలి. కేసు పూర్తయ్యే దాకా సదరు అధికారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకూడదు. ఏసీబీ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లోనే తీర్పు వచ్చేలా చూడాలి. ప్రస్తుతమున్న 50 శాతం కన్విక్షన్ రేటు 90 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే.. ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులంతా జైలు పాలవుతారు. లంచాలు తీసుకునేందుకు మిగతా అధికారులు కూడా భయపడతారనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయ్.
Story by Anup, Big Tv