KCR : తెలంగాణ అసెంబ్లీలో పోడు భూములపై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రత్యేక విధానం ఉందని తెలిపారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని వెల్లడించారు. అటవీ భూములపై నివేదికలు సిద్ధమయ్యాయని చెప్పారు. అభ్యంతరాలు లేకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామని చెప్పారు. గుత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికి వేయిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. అటవీ అధికారులపై దాడులను ఖండించారు. గిరిజనులను గత ప్రభుత్వాలే మోసం చేశాయని ఆరోపించారు. పోడు భూములపై రాజకీయ చేయడం తగదన్నారు.
గిరిజనులకు వరాలు..
ఫిబ్రవరి నెలాఖరులో పోడ భూములను పంపిణీ ప్రారంభిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వారికి రైతు బంధు, విద్యుత్ , సాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో భూములు తీసుకున్న గిరిజనులు పోడు భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలని కోరారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భూమిలేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆక్రమించారు..
పోడు భూములు అనేవి హక్కు కాదు… దురాక్రమణ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అడవులను నరికేయడం సరికాదన్నారు. కొందరు అగ్రకులాల వారు గిరిజన యువతులను పెళ్లి చేసుకుంటున్నారని తెలిపారు. ఖమ్మంలోని కొన్ని అగ్రవర్ణాలవారు అటవీ భూములను కబ్జా చేశారని కేసీఆర్ ఆరోపించారు. 20 ఎకరాల వరకు పోడు భూములు ఎవరికైనా ఉంటాయని అని ప్రశ్నించారు.
అటవీ భూములకు రక్షణ..
గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయవద్దని కేసీఆర్ ఆదేశించారు. అలాగే అధికారులపైన గిరిజనులు దాడులకు దిగవద్దని హెచ్చరించారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదన్నారు. ఇక నుంచి అటవీ ప్రాంతంలోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని స్పష్టం చేశారు. అటవీ సరిహద్దుల్లో సాయుధ దళాలతో పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతామన్నారు.