Telangana Formation Day: కేసీఆర్ ఫ్యామిలీ రేగిన చిచ్చు ఇంకా చల్లార లేదా? తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా బిల్డ్ చేసుకున్న ఆ ఫ్యామిలీ, ఎందుకు రాష్ట్ర అవతరణ వేడుకలకు దూరంగా ఉంది? పార్టీలో అంతర్గత కలహాలే కారణమా? కావాలనే ఆ విధంగా ప్లాన్ చేశారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయి.
తెలంగాణ చెప్పగానే కేసీఆర్ పేరు వచ్చేవిధంగా బిల్డ్ చేసింది ఆ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ప్రజల నుంచి మొదలు పైస్థాయి వరకు అందరూ పాలు పంచుకున్నారు. రాజకీయ నేతలు చేయాల్సింది చేశారు. అదే వేరే విషయం. సమిష్టి కృషితో తెలంగాణ ఏర్పడిందని సమయం, సందర్భం వచ్చినప్పుడు చాలామంది నేతలు చెబుతారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి గడిచిన పదేళ్లు వాడవాడలా ఉత్సవాలు చేసింది బీఆర్ఎస్. అధికారం కోల్పోయిన ఆ పరిస్థితి కనిపించలేదు. ఉత్సవాల మాట ఏమోగానీ ఫ్యామిలీలో కీలక నేతలు చెల్లాచెదురుగా ఉన్నారు. ఈ దుస్థితికి కారణమేంటి? ఎవరు? అనేది తెలంగాణ ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారు. అసెంబ్లీకి రావాలని పదేపదే అధికార పక్షం చెబుతోంది. అయినప్పటికీ రావటానికి ఆయన మనసు అంగీకరించలేదు. ప్రతిపక్ష హోదా ఛైర్‌లో కూర్చోవడానికి ఆయన ఇష్టపడడం లేదని కొందరు నేతలు ‘ఆఫ్ ద రికార్డు’లో చెబుతున్నారు.
ALSO READ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
ఈ విషయం కాసేపు పక్కనబెడితే.. రేపో మాపో కారు పార్టీ స్టీరింగ్ అందుకోనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉండటాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసిన సభకు హాజరై, తెలంగాణ గురించి, వారి పాలన గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్‌లోని ఓ వర్గం వాదన మరోలా ఉంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం రూపు రేఖలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్, దాన్ని మార్చి సాధారణ మహిళ రూపంలో ఉన్న విగ్రహాాన్ని ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే బీఆర్ఎస్ ఆవిర్భావం వేడుకలకు దూరంగా ఉందని అంటున్నారు.
ఫ్యామిలీ, పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయి చేరాయని అంటోంది మరో వర్గం. ఆ కారణంగానే కీలకమైన వారంతా ఒక్కో వైపు చెదిరిపోయారని అంటున్నారు. దీనివెనుక రాజకీయాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఖచ్చితంగా వేడుకలకు హాజరు కావాల్సి ఉంటుందని భావించి యువనేత, ఫారెన్‌కి వెళ్లిపోయారని అంటున్నారు. ఫ్యామిలీ వేసుకున్న స్కెచ్ ప్రకారమే వారంతా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వేడుకలకు హాజరైతే బాగుంటుందని కొందరు నేత మాట.