Solar Plants: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనేక ప్రభుత్వ పథకాలు కల్పిస్తున్నాయి. మహిళల స్వయం ఉపాధి ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలతో పాటు భారీగా సబ్సిడీలు కల్పిస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న మగువలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్తు ఉత్పత్తి బాధ్యతలను మహిళలకు అప్పగిస్తుంది. మహిళా సంఘాల ద్వారా మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో నాలుగు గ్రామాలను సెలక్ట్ చేసింది.
ఎంపిక చేసిన గ్రామంలో సుమారు 4 ఎకరాల ప్రాంతంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. స్థలం ఎంపిక బాధ్యత కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. స్థలం నిర్థారించి, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును కాంట్రాక్టర్ అప్పగించనుంది. సోలార్ ప్లాంటు నిర్వహణను మాత్రం ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలకు కేటాయించనుంది. ఖమ్మం జిల్లాలోని రెండు గ్రామాల్లో భూ పరీక్ష పూర్తి చేశారు. ఈ రెండు గ్రామాల్లో త్వరలో ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి, భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడతనేనిగుంపు, ఎర్రుపాలెం మండలం రాజుపాలెంను సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎంపిక చేశారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన సమాఖ్యలో ఆసక్తి గలిగిన మహిళలు ఎంత మందైనా ఉండవచ్చు. ఒక్కో సోలార్ ప్లాంటు నిర్వహణ వ్యయాన్ని రూ.2.97 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 90 శాతం బ్యాంకు లోన్ రూపంలో అందిస్తారు. మిగిలిన 10 శాతం మహిళా సంఘాల పొదుపు సొమ్ము నుంచి చెల్లించాలి. పదేళ్ల కాలపరిమితితో ఈ లోన్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాంటుల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్తును డిస్కంకు విక్రయిస్తారు. ఒక్కో యూనిట్‌కు రూ.3.13 చొప్పున ప్లాంటు నిర్వాహకులకు చెల్లిస్తారు. దీంతో సంవత్సరానికి రూ.10 నుంచి 20 లక్షల ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా రూ.50 లక్షలు ఆదాయం పొందే అవకాశం ఉందంటున్నారు.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద భారీ సబ్సిడీతో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 64.85 లక్షల మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 34,263 ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా 68.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్
పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఖర్చులో 40% వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ అందించడమే ఈ పథకం లక్ష్యం.