BigTV English

khammam politics : ఖమ్మంలో విందు రాజకీయాలు.. తుమ్మల వ్యూహమేంటి? .. పొంగులేటి దారెటు..?

khammam politics : ఖమ్మంలో విందు రాజకీయాలు.. తుమ్మల వ్యూహమేంటి? .. పొంగులేటి దారెటు..?

khammam politics : నూతన సంవత్సరం తొలిరోజే ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడి పుట్టించాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూ ఇయర్‌ సందర్భంగా విందు రాజకీయాలకు తెర లేపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతల రాజకీయ భవితవ్యంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం తొలిరోజే ఇద్దరు నేతలు విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.


తుమ్మల వ్యూహమేంటి..?
మాజీ మంత్రి తుమ్మల గతంలో ప్రాతినిథ్యం వహించిన పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం గ్రామీణ మండలంలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన తుమ్మల అభిమానులు, నాయకుల ఆత్మీయ కలయిక పేరుతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల అభిమానులు భారీగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తామంతా తుమ్మల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల చేసిన కృషిపై 10 వేల పుస్తకాలు ముద్రించి పంపిణీ చేపట్టారు. తుమ్మల మళ్లీ పాలేరు నుంచే పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్‌రెడ్డి ఉన్నారు. మళ్లీ బీఆర్ఎస్ తరఫున తానే పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మరి తుమ్మల ఎలాంటి వ్యూహంతో ముందుకెళతారో చూడాలి.

పొంగులేటి దారెటు..?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోసం తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ లో గత నాలుగేళ్లుగా మనకు ఎలాంటి గౌరవం దక్కిందో మీ అందరికీ తెలుసని పొంగులేటి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కానీ ఇంకా ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులతో ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.


భద్రాచలం, మధిర మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో తనతోపాటు తన అనుచరులు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని పొంగులేటి చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటిని కాదని బీఆర్ఎస్ నామా నాగేశ్వరారవుకు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో నామా విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి పొంగులేటికి పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అబిమానులు భావిస్తున్నారు. పొంగులేటి పార్టీ మారుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీ మార్పుపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో పార్టీ మారతారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి.

మరోవైపు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తన సొంత నియోజకవర్గం ఖమ్మంలోని 17వ డివిజన్‌ నుంచి వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి డివిజన్‌లో స్థానిక నాయకులు, ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేతలందరూ పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూ ముందుకుసాగుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×