Kingfisher Beers: కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే.. ఓపెనర్ జారిపోయే అనే పాట వినే ఉంటారు కదా. ఇప్పుడు అదే జరిగింది. కానీ జారింది మాత్రం ఓపెనర్ కాదు. బీరు ప్రియుల గుండె జారింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా.. ఏకంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా బంద్ అంటూ ప్రకటన వచ్చేసింది. ఇక అంతే కింగ్ ఫిషర్ బీరు ప్రియుల నాలుక చివుక్కుమందట. అసలేం జరిగిందంటే?
బీరు ప్రియులకు షాకిచ్చే న్యూస్ ఇది. మద్యం కంటే బీరు త్రాగే వారే అధికం. బీరు తాగితే అదొక అనుభూతి పొందవచ్చని బీరు ప్రియుల భావన. పండుగ వచ్చినా, శుభకార్యమైనా మద్యం కంటే బీరుకే గిరాకీ ఎక్కువ. అయితే అందులో కూడ కింగ్ ఫిషర్ బీర్లకు ఉండే క్రేజ్ వేరు. బీరు ప్రియులు వైన్ షాపుకు వెళ్లారంటే, ముందుగా అడిగేదే కింగ్ ఫిషర్ బీర్లు ఉన్నాయా అని. అంతటి క్రేజ్ గల కింగ్ ఫిషర్ బీర్లు ఇక తెలంగాణలో కనిపించవని యునైటెడ్ బ్రెవరీస్ సంస్థ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా బంద్ చేస్తున్నట్లు యునైటెడ్ బ్రెవరీస్ సంస్థ ప్రకటన జారీ చేసింది. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిస్టిలరీస్ రేట్ల పెంపు ప్రతిపాదనలు అమోదించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కి సంస్థ యాజమాన్యం లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ధరల పెరుగుదల లేకపోవడంతో, భారీ నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది.
Also Read: BJP on KCR: పెద్దమనిషి ఎక్కడ? కేసీఆర్ పై బీజేపీ సంచలన ట్వీట్
అసలే సంక్రాంతి రాబోతోంది. ఈ సమయంలో ఇదేమి ప్రకటన అంటున్నారు బీరు ప్రియులు. ధరలు పెంచితే, బీరు ప్రియులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదన కూడ వినిపిస్తోంది. అయితే కింగ్ ఫిషర్ బీర్ లేకుంటే ఎలా అంటున్నారు మరికొందరు బీరు ప్రియులు. ఏదిఏమైనా మరోమారు కింగ్ ఫిషర్ యాజమాన్యం ఆలోచించాలని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదని వారు కోరుతున్నారు. మరి ఈ విన్నపాలకు యాజమాన్యం దిగి వస్తుందా, లేక కింగ్ ఫిషర్ ఇక దూరమేనా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.