Cherlapally Railway station Sleeping Pods: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను రీసెంట్ గా ప్రధాని మోడీ ప్రారంభించారు. సుమారు రూ. 428 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా ఈ రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రైల్వే స్టేషన్ లో ఎగ్జిక్యుటివ్ లాంజ్, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వెయిటింగ్ ఏరియాలు, కేఫ్ టేరియా, రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. చూడటానికి ఎయిర్ పోర్టులా ఉండటమే కాదు, ఎయిర్ పోర్టులో ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాలు ఇక్కడా కల్పిస్తున్నారు. అందులో ముఖ్యమైన స్పెసిలిటీ స్లీపిండ్ పాడ్స్. ఇంతకీ ఈ స్లీపింగ్ పాడ్స్ ప్రత్యేకత ఏంటంటే..
ప్రయాణీకుల విశ్రాంతి కోసం అత్యాధునిక స్లీపింగ్ పాడ్స్
సుదూర ప్రయాణం చేసి అలసిపోయిన ప్రయాణీకులు విశ్రాంతి తీసుకునేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ లో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా తొలిసారి అత్యాధునిక విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణం చేసి అలసిపోయిన వాళ్లు స్లీపింగ్ పాడ్స్ లో నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఈ స్లీపింగ్ పాడ్స్ ఉపయోగించుకునేందుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్లీపింగ్ పాడ్స్ ప్రయాణీకులకు ప్రశాంతతో కూడిన నిద్రను అందించనున్నాయి. స్లీపింగ్ పాడ్స్ ఉపయోగించుకునే ప్రయాణీకులకు సంబంధించిన లగేజీతో పాటు ఫుట్ వేర్ ను భద్రపరుచుకునేందుకు ప్రత్యేకమైన లాకర్ ఏరియా అందుబాటులో ఉంటుంది.
జపాన్ లో తొలిసారి స్లీపిండ్ పాడ్స్ అందుబాటులోకి
స్లీపింగ్ పాడ్స్ అనేవి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ పోర్టులు, హాస్పిటల్స్, యూనివర్సిటీలతో పాటు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఈ స్లీపింగ్ పాడ్స్ లో సుమారు అరగంట పాటు విశ్రాంతి తీసుకుంటే ఒత్తిడి తగ్గిపోయి, మళ్లీ యాక్టివ్ అవుతారట. విదేశాల్లోని యూనివర్సిటీ లైబ్రరీలలో కూడా ఈ స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉంటాయి. బాగా చదివిన తర్వాత అలసిపోయిన విద్యార్థులు వీటిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఫోకస్ పెరగడంతో పాటు లెర్నింగ్ స్కిల్స్ మెరుగవుతాయని భావిస్తారు. ధనవంతుల ఇళ్లలోనూ ఈ స్లీపింగ్ ప్లాడ్స్ ను ఉపయోగిస్తారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు వీటిలో విశ్రాంతి తీసుకుంటారు.
ప్రపంచంలో తొలిసారి ఈ స్లీపింగ్ పాడ్ ను జపాన్ తయారు చేసింది. ఆ తర్వాత ఇవి నెమ్మదిగా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లోనూ ప్రయాణీకుల విశ్రాంతి కోసం ఈ స్లీపింగ్ పాడ్స్ ను ఏర్పాటు చేశారు. వీటికి ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. వీటిలో రెస్ట్ తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్లే చర్లపల్లి రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు.
Read Also:ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఆ రెండు వందేభారత్ రైళ్లలో సీటింగ్ కెపాసిటీ పెంపు!