Konda Murali : కొండా కుటుంబం. కొండా సురేఖ, కొండా మురళి. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ కపుల్స్. ఇద్దరూ ఇద్దరే. మాస్ లీడర్స్. మాస్ డైలాగ్స్. మాటలు తూటాల్లా ఉంటాయ్. చేతలు చురకత్తుల్లా దిగుతాయ్. అందుకే RGV సైతం కొండా సినిమా తీశారు. మొదటి నుంచి కాంగ్రెస్ రక్తమే. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి వీర విధేయులు. మధ్యలో కారెక్కినా.. మళ్లీ కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా ఉన్నారు. వాళ్ల రాజకీయం వేరే లెవెల్. ప్రోటోకాల్స్, పద్దతులు గట్రా ఉండవు. తమకు నచ్చింది నచ్చినట్టు చేసుకుపోవడమే. నోటికి వచ్చినట్టు మాట్లాడటమే. అందుకే, మంత్రి కొండా సురేఖ చేసిన పలు కామెంట్స్ ఇటీవల కాలంలో తీవ్ర కలకలం రేపాయి. లేటెస్ట్‌గా కొండా మురళీ మాట్లాడిన మాటలు.. కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది.
కాంట్రవర్సీ కొండా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులదే హవా. కొత్తగా వాళ్ల కూతురు సుస్మితా పటేల్ సైతం రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. జిల్లా మొత్తం తమదే అంటారు. అన్ని నియోజకవర్గాల్లో వేలు పెడుతుంటారు. మిగతా నేతలతో అంతగా కలవరు. గొడవలూ చాలానే ఉన్నాయి. మేము మోనార్క్. అదే కొండా స్టైల్. ఇలా వారిపై రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కొండా కుటుంబంలో ముగ్గురికి మూడు ఎమ్మెల్యే టికెట్లు కావాలంటారు. గత ఎన్నికల్లో ఆ డీల్ కుదరకపోవడంతో వరంగల్ తూర్పులోనే పోటీ చేసి గెలిచారు సురేఖ. వచ్చే ఎన్నికల్లోనైనా పరకాల నియోజకవర్గంలో కూతురు సుస్మితా పటేల్‌ను బరిలో దించాలనేది వాళ్ల టార్గెట్. అందుకే, సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో గిల్లికజ్జాలు పెరిగాయి.
అందరికీ ఒకేసారి ఇచ్చిపడేశారు..
రేవూరిని 75 ఏళ్ల ముసలోడు అంటూ కొండా మురళి బహిరంగంగా కామెంట్స్ చేయడం కాంట్రవర్సీగా మారింది. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేనోడని.. వర్థన్నపేట ఎమ్మెల్యే, మాజీ పోలీస్ ఆఫీసర్ నాగరాజును ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని.. వాళ్లంతా దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలంటూ.. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీని షేక్ చేసింది. సురేఖ మంత్రి పదవికి ఢోకా లేదని.. తాము ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవడం లేదని.. తానే సురేఖకు నెలకు రూ.5 లక్షలు పంపిస్తున్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. తనకు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలే అండా దండా అని చెప్పారు.
కొండా తగ్గేదేలే.. వాళ్లు వదిలేదేలే..
కొండా దెబ్బకు.. ఆయన వ్యతిరేక వర్గమంతా ఏకమయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నాయకత్వంలో భవిష్యత్ కార్యచరణ రెడీ చేశారు. కొండాకు యాంటీగా ఉన్న లీడర్స్ అంతా మీటింగ్‌కు రావడం ఆసక్తికరం. నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, నాగరాజు, బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లి స్వర్ణ.. ఇలా బాధితులంతా కలిసి చర్చించుకున్నారు. ఈసారి కొండాను వదిలేదేలేదంటూ తాడోపేడో తేల్చుకునేందుకు సై అన్నారు. కొండా జంట.. జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో వర్గాలను పెంచి పోషించి చిచ్చు పెడుతున్నారని వారంతా మండిపడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీని చెడగొడతామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. అధిష్టానంను కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు.
Also Read : కవిత ఫోన్ కూడా ట్యాపింగ్?
కాంగ్రెస్‌లో అంతేనా?
కొండా మురళి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయంటూ.. ఇరు వర్గాల నుంచి కంప్లైంట్స్ వచ్చాయని చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే, కాంగ్రెస్‌లో ఇలాంటివన్నీ కామన్. కొండా లాంటి బలమైన నాయకుడిపై అంత ఈజీగా చర్యలు తీసుకునే అవకాశం లేదని అంటున్నారు పార్టీ శ్రేణులు.