Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణను షేక్ చేస్తోంది. నాయకులే కాదు వారి పక్కనుండే చోటామోటా లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. అంటే, ఆనాటి సీఎం కేసీఆర్‌లో ఎంతటి ఓటమి భయం ఉందో అర్థమవుతోందని అంటున్నారు. ఎన్నికల సర్వేలు చేసే సైదులును కూడా వదిలిపెట్టలేదంటే ఏమనాలి? ఆఖరికి గోనె ప్రకాశ్‌రావు ఫోన్ కూడా సీక్రెట్‌గా విన్నారంటే.. ఆయనకు కూడా భయపడిపోయారంటే.. ఎంత దారుణం? ఎన్నికలకు ముందు ఒక్క నెలలోనే 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారని తెలుస్తోంది. ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ పెన్‌డ్రైవ్స్‌లో కాపీ చేసి కావలసిన వారికి ఇచ్చారట. అలాంటి పెన్‌డ్రైవ్స్ సైతం వందలాదిగా ఉన్నాయని సిట్ గుర్తించింది. ఆ పెన్ డ్రైవ్‌లు ఎవరెవరికి ఇచ్చారనే దానిపై ప్రభాకర్ రావ్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. అవి దొరికితే కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి.
సుప్రీంకోర్టుకు సిట్?
SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ఐదవ సారి సిట్ విచారిస్తోంది. రోజుకు 8-9 గంటల పాటు ఎంక్వైరీ నడుస్తోంది. మావోయిస్టులకి సహకరిస్తున్నారని కారణాలు చూపి లీగల్ ఇంటర్ సెప్షన్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు ప్రభాకర్ రావు. సానుభూతిపరుల పేరుతో వందల మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. అయితే ఆ లిస్ట్‌లో ఒక్కరిపై కూడా కేసులు నమోదు కాలేదు. అప్పుడు మావోయిస్టు సానుభూతిపరులు ఎలా అవుతారంటూ సిట్ ప్రశ్నించింది. విచారణలో ప్రభాకర్‌రావు దాటవేత ధోరణితో సమాధానాలు చెబుతున్నారని.. దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
బండి బలగం ఫోన్లు ట్యాప్
మరోవైపు, బండి సంజయ్ టార్గెట్‌గా నాటి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు తెలుస్తోంది. సంజయ్ సన్నిహితులు, అనుచరులు, సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. బండి ప్రధాన అనుచరుడు ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయినట్టు తెలిసి.. ఆయన నుంచి వివరాలు తీసుకునేందుకు నోటీసులు ఇవ్వనుంది సిట్. 317 జీవో, టెన్త్ పేపర్ లీకేజ్, భైంసా అల్లర్ల సమయంలో.. బండి సంజయ్ వెంటే ఉన్నారు ప్రవీణ్ రావు.
కవిత ఫోన్ కూడా ట్యాప్?
వరుసగా మూడవసారి అధికారంలోకి రావడానికి.. కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు గోనె ప్రకాశ్ రావు. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అవడంతో సిట్ అధికారులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. విచారణ అనంతరం గోనె సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్, సంతోష్‌రావులు కలిసి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కలకలం రేపారు. గతంలో కవితకు, కేటీఆర్‌కు మధ్య గొడవలు ఉండేవి. కొన్నాళ్ల పాటు వారిద్దరూ మాట్లాడుకోలేదు. అన్నకు రాఖీ కూడా కట్టలేదు. ఆస్తుల, ఆధిపత్యం కోసమే గొడవలు అని అన్నారు. ఇప్పుడు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని గోనె ప్రకాశ్‌రావు ఆరోపించడం చూస్తుంటే నిజమే అనిపిస్తోందని అంటున్నారు గులాబీ శ్రేణులు. కవిత ఫోనే ట్యాప్ చేయగా.. ఇక షర్మిల ఫోన్ రికార్డ్ చేశారనడంలో డౌట్ ఏం ఉంటుంది?
అంతా ఆ ఇద్దరే చేశారా?
ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్టులను.. కేసీఆర్, సంతోష్‌రావులకు ఇచ్చారన్నారు. ఓటుకు నోటు విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో పైలెట్ రోహిత్ రెడ్డి, నందకుమార్‌ల ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై ఫోకస్ పెట్టాలని.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు గోనె ప్రకాశ్‌రావు.