Blood Sugar: డయాబెటిస్‌ను గుర్తించడంతో పాటు అదుపులో ఉంచడం కోసం బ్లడ్ షుగర్ (రక్తంలో చక్కెర) స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించడం చాలా ముఖ్యం. గ్లూకోమీటర్ (గ్లూకోజ్ మీటర్) ఉపయోగించి పరీక్షించుకునేటప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు చేసినా.. ఫలితాలు కచ్చితంగా రాకపోవచ్చు. అంతే కాకుండా మీరు తీసుకునే చికిత్స లేదా ఆహారంలో మార్పులు కూడా సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి. పరీక్షించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సాధారణంగా చేసే పొరపాట్లు, వాటిని నివారించే మార్గాలు:
1. చేతులు శుభ్రం చేసుకోకపోవడం:
పొరపాటు: పరీక్షించే ముందు చేతులను సరిగ్గా శుభ్రం చేయకపోవడం. చేతులపై ఆహారపు అవశేషాలు, నూనెలు, లోషన్లు లేదా ఇతర చక్కెర పదార్థాల ఆనవాళ్లు ఉంటే.. అవి రిపోర్ట్ తప్పుగా చూపిస్తాయి. ఫలితంగా.. మీ రక్తంలో చక్కెర స్థాయి వాస్తవంగా ఉన్న దానికంటే ఎక్కువగా కనిపించే ప్రమాదం కూడా ఉంటుంది.
నివారణ: పరీక్షకు ముందు సబ్బు, గోరు వెచ్చని నీటితో చేతులను శుభ్రంగా కడగాలి. శుభ్రమైన తువ్వాలుతో పూర్తిగా ఆరబెట్టాలి. హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించకూడదు. ఎందుకంటే అందులోని ఆల్కహాల్ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆల్కహాల్ ప్యాడ్‌ను ఉపయోగిస్తే.. పొడిబారే వరకు ఆగాలి.
2. తప్పు సమయాల్లో పరీక్షించడం:
పొరపాటు: భోజనం చేసిన వెంటనే.. పరీక్షించడం లేదా అస్థిరమైన సమయాల్లో పరీక్షించడం. భోజనం చేసిన వెంటనే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది సరైన రీడింగ్ కాదు.
నివారణ: మీ డాక్టర్ సూచించిన సమయాల్లో మాత్రమే పరీక్షించండి. సాధారణంగా.. భోజనం చేసిన రెండు గంటల తర్వాత పరీక్షించడం వల్ల చక్కెర స్థాయిలు స్థిరంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. పరగడుపున (ఉదయం ఆహారం తీసుకోకముందు) పరీక్షించడం కూడా చాలా ముఖ్యం.
3. టెస్ట్ స్ట్రిప్స్ విషయంలో అజాగ్రత్త:
పొరపాటు: గడువు ముగిసిన (ఎక్స్‌పైర్ అయిన) లేదా సరిగా నిల్వ చేయని టెస్ట్ స్ట్రిప్స్‌ను ఉపయోగించడం. టెస్ట్ స్ట్రిప్స్ తేమ, అధిక వేడికి గురైతే లేదా వాటి గడువు ముగిస్తే.. ఫలితాలు తప్పుగా వస్తాయి.
నివారణ: స్ట్రిప్స్ గడువు తేదీని తప్పకుండా చెక్ చేయండి. వాటిపై సూచించిన విధంగానే, సీల్ చేసిన డబ్బాలో, చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. డబ్బా మూతను గట్టిగా మూయాలి.
4. రక్తం తగినంత లేకపోవడం లేదా బలవంతంగా పిండటం:
పొరపాటు: పరీక్షించడానికి తగినంత రక్తం రాకపోతే, వేలిని గట్టిగా పిండడం. ఇలా గట్టిగా పిండడం వల్ల కణజాల ద్రవం కూడా రక్తంతో కలిసిపోయి.. ఫలితాన్ని తప్పుగా చూపే అవకాశం కూడా ఉంటుంది.
నివారణ: రక్త ప్రసరణ మెరుగు పరచడానికి వేలిని కొద్దిసేపు కిందకు వేలాడదీయండి లేదా వెచ్చని నీటితో కడగండి. వేలి కొనకు బదులుగా పక్క భాగాన్ని గుచ్చండి. ఒక చుక్క రక్తాన్ని మాత్రమే తీయాలి. సరిపడా రక్తం రాకపోతే.. మళ్లీ కొత్త లాన్సెట్‌తో గుచ్చి, కొత్త స్ట్రిప్‌ను ఉపయోగించండి.
5. లాన్సెట్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగించడం:
పొరపాటు: రక్త పరీక్ష తీసుకోవడానికి ఉపయోగించే లాన్సెట్ (చిన్న సూది)ను మళ్లీ మళ్లీ వాడటం. ఇలా చేయడం వల్ల నొప్పి, ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. పాత లాన్సెట్‌లు మొద్దుబారి, పరీక్ష మరింత బాధాకరంగా మారుతుంది.
నివారణ: ప్రతిసారీ కొత్త లాన్సెట్‌ను ఉపయోగించండి. ఉపయోగించిన వెంటనే లాన్సెట్‌ను సురక్షితమైన పద్ధతిలో పారేయండి.
6. మీటర్ కోడింగ్ సరిగా చేయకపోవడం:
పొరపాటు: కొన్ని గ్లూకోమీటర్‌లలో.. కొత్త టెస్ట్ స్ట్రిప్స్ డబ్బా తెరిచిన ప్రతిసారీ మీటర్‌కు కోడ్ (నంబర్)ను సరి చేయాల్సి ఉంటుంది. లేదంటే తప్పుడు ఫలితాలు వస్తాయి.
నివారణ: మీ మీటర్ ఆటోమేటిక్‌గా కోడ్ అవుతుందో లేదో తెలుసుకోండి. కోడింగ్ అవసరమైతే.. కొత్త డబ్బాపై ఉన్న కోడ్‌ను మీటర్‌లో తప్పకుండా చెక్ చేయండి.
బ్లడ్ షుగర్ పరీక్షలో ఈ సాధారణ పొరపాట్లను నివారించడం ద్వారా.. మీరు మీ డయాబెటిస్ నియంత్రణకు అవసరమైన కచ్చితమైన సమాచారాన్ని పొందగలుగుతారు. సరైన సాంకేతికతను పాటించడం, మీ డాక్టర్ సలహాలను అనుసరించడం డయాబెటిస్ నిర్వహణలో చాలా కీలకమైన అంశాలు. ఎప్పటికప్పుడు మీ గ్లూకోమీటర్‌ను దాని కంట్రోల్ సొల్యూషన్‌తో చెక్ చేయించడం కూడా మంచిది.