సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు… సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఏమని? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. బాగుంది. ఆ లేఖలో ఆయన.. ఆర్టీసీలో ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్నదేమిటీ? దీని వల్ల సంస్థకు ఎలా నష్టం జరుగుతున్నది? ఏం చేస్తే ప్రయోజనం ఉంటుంది? కార్మికుల సంక్షేమం కోసం సర్కార్ తీసుకోవాల్సిన చర్యలేమిటీ? ఇవన్నీ రాశారు. ఈ విషయంలోకి లోతుగా వెళ్లడం లేదు. ఎందుకంటే.. అవి పాతవే. గతంలో లేవనెత్తినవే. కార్మిక లోకం అడుగుతున్నదే. సర్కార్ గమనంలో ఉన్నవే. అవేవీ కొత్త కాదు కానీ… ఇది వార్తైంది… కోదండరామ్ పేరు ఇక్కడ తెరపైకి వచ్చింది. అదేంది? ఈ లేఖకు కోదండరామ్‌కు సంబంధమేముంది? ఆగండి.. అక్కడికే వస్తున్నా.. ఇక చదవండి.
సర్కార్‌కు సీపీఐ మిత్రపక్షం. మిత్ర పక్షం కాబట్టి.. పాలనపరమైన ఇష్యూలలో దాదాపుగా విభేదించే చాన్సే లేదు. కొన్ని సలహాలు, సూచనలు చేయొచ్చు. హద్దులు దాటలేరు. సరిహద్దులను గమనిస్తూ సున్నితంగా సూచించాలి.. ఒక రకంగా చెప్పాలంటే కట్టె విరిగొద్దు.. పాము చావొద్దు.. అలా అన్నమాట. కానీ కూనంనేని ఏకంగా సర్కార్‌కు బహిరంగ లేఖే రాశారు. అదీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. ఈ ప్రతిపాదన గతంలో ఉన్నదే. బీఆరెస్ సర్కార్ పాలనలో చివరి దశలో ఈ ప్రతిపాదన చేసి గవర్నర్‌కు పంపారు.
ఇక దీనిపై అతీగతి లేదు. షరా మామూలుగా ఆర్టీసీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికుల అసంతృప్తి కూడా అదే రీతిలో పెరుగుతూ వస్తోంది. అయితే కూనంనేని ఈ సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టాడు. సమస్యల తీవ్రతను సర్కార్ అర్థం చేసుకుని వెంటనే పరిష్కరించకపోతే కార్మికలోకం నిరవధిక సమ్మెకు దిగుతారనే విషయాన్ని కూడా సూటిగానే పేర్కొన్నారా లేఖలో. సలహా ఇస్తూనే పరిష్కార చూపండని విజ్ఞప్తి చేస్తూనే.. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని సంకేతాలిస్తూనే… మిత్రపక్షమే ఈ విధంగా లేఖ రూపంలో చెబుతున్నదంటే దీన్ని సీరియస్‌గా తీసుకోవాలనే పరోక్షంగా హెచ్చరిస్తూనే.. ఇవన్నీ ఒక లేఖ ద్వారా చెప్పకనే చెప్పాడన్నమాట కూనంనేని.
అంతే కాదండోయ్… మొన్నటికి మొన్న అసెంబ్లీలో ముగ్గురు ఖమ్మం మంత్రులనుద్దేశించి సెటైర్ వేశాడు. సూటిగా ఆ విమర్శ వాళ్ల ముగ్గురికీ తగిలింది. ఏమన్నాడో తెలుసా? నిధులన్నీ ఖమ్మానికే తరలిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. కానీ ఆ నిధులు నా దాకా వచ్చినట్టైతే లేదు. నిధుల సంగతి అటుంచండి… నాకు ఒక్క పని కూడా అవడం లేదు. ఎవరు వినడం లేదు.. అని సర్కార్ వైఖరి, మంత్రుల వ్యవహార శైలిపై ఘాటు కామెంట్లు చేయడం కలకలం రేపింది. ఇప్పుడిలా. ఆర్టీసిపై లేఖ.
కోదండరామ్ గురించి చెప్పమంటే.. తిప్పీ తిప్పీ.. కూనంనేని లేఖ కథనే చెప్పి…. ! ఆగండి..అక్కడికే వస్తున్నా..
మొన్నటిమొన్న కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ మీటింగయ్యింది. ఆ మీటింగులో లీడర్లంతాఆ ఒకవైపు. కోదండరాం ఒక్కడే ఒకవైపు. ఏ విషయంలో అంటారా? సర్కార్ ను సమస్యలపై అడిగే విషయంలో.. మిత్రపక్షమైనా మనం వెనుకబడి పోతున్నామనే ఆవేదన విషయంలో. తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయంలో.. ప్రజా సమస్యలు వాటి పరిష్కారం విషయంలో.. ఇలా చాలానే ముందుంచారు. అన్నింటికీ సారు మౌనమే సమాధానంగా ఉన్నారు. కానీ వీళ్లు ఊరుకోలేదు.
వచ్చే నెల 9న నిర్వహించే నాలుగో ప్లీనరీలో ఇవన్నీతీర్మానాలుగా ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెచ్చి డిసైడ్ అయ్యి సాధించారు. అందులో ఆర్టీసీ, సింగరేణి, ఎస్ఐఆర్, జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ… ఇలా కీలకమైన అంశాలన్నీ పెట్టారు. పనిలో పని మొన్న అసెంబ్లీలో కూనంనేని మాట్లాడిన మాటలూ ప్రస్తావనకు తీసుకొచ్చారు. సీపీఐ కూడా మిత్రపక్షమేగా మరి వాళ్లెందుకు అలా ఉన్నారు? మనమెందుకు ఇలాగే ఉండాలె..? అనేది అక్కడ తీవ్రంగా చర్చకు వచ్చింది.
ఇప్పుడు కూనంనేని ఆర్టీసీ లేఖ…. అందరి దగ్గరేమో గానీ.. తెలంగాణ జన సమితి పార్టీలో మాత్రం చర్చకు రావడం ఖాయం.