Krishna Basin: స్వేచ్ఛ బ్యూరో: నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులకు పైగానే అయిన కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు ఇంకా వెలవెలబోతూనే ఉన్నాయి. ఎల్ నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూలు, గుంటూరు జిల్లాల రైతులు ఆకాశం వైపు దీనంగా చూసే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రవహించే కృష్ణమ్మకు వరద నీరు రాకపోవడంతో అన్నదాతలు అయోమయంలో పడారు. ఖరీప్ సీజన్ దాటి రెండు నెలలు పూర్తయింది. విత్తనాలు విత్తి వర్షాల కోసం రైతాంగం ఎదురుచూస్తోంది. ఒకవేళ వరుణుడు ముఖం చాటేస్తే, రాబోయే రోజుల్లో కృష్ణా జలాల పంపిణీ కోసం రాష్ట్రాల మధ్య మళ్లీ పాత నీటి పంచాయితీలు, రాజకీయ వివాదాలు రగులుకునే ప్రమాదం ఉంది.
ఇప్పుడు వరుణుడి కరుణ కోసం కేవలం రైతులు మాత్రమే కాదు, ప్రభుత్వాలు కూడా ప్రాధేయపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులు నీటి ఎద్దడికి దారితీసే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తరుణంలో కృష్ణా బేసిన్‌లోని ఏపీ, తెలంగాణ రైతుల కళ్లు ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తున్నాయి. మహారాష్ట్ర, పూణే లో గత వారం రోజుల నుంచి కురుసిన వర్షాలే ఖరీఫ్ సీజన్‌కు ప్రాణం పోస్తాయని తెలంగాణ రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుసిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో గల ఆల్మట్టి డ్యాంకు వరదనీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి డ్యాం నుంచి నారాణపూర్ డ్యాంకు అక్కడి నుంచి జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు జలాలు చేరే అవకాశం ఉందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల సాగునీటి భవితవ్యం మొత్తం ఆల్మట్టి డ్యామ్ గేట్ల చేతిలోనే ఉంటుంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కర్ణాటక ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. ఆ వరద ముందుగా చేరేది ఆల్మట్టికే. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటిమట్టం 519 మీటర్లు దాటితేనే, దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తారు. అక్కడి నుంచి గేట్లు ఎత్తితేనే తెలంగాణలోని జూరాలకు, ఆ తర్వాత ఏపీలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కృష్ణా జలాలు పరుగులు తీస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, కర్ణాటకలో కురిసే ప్రతి చుక్కా.. ఆంధ్రా, తెలంగాణ రైతుల కన్నీటిని తుడిచే సంజీవని లాంటిది.
Also Read: TGSPDCL: ఈ దారుణాలకు బాధ్యులెవరు.. వణుకు పుట్టిస్తున్న విద్యుత్ శాఖ రిపోర్ట్..!
మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ నదికి వరద పోటెత్తింది. ఎల్‌నినో ప్రభావంతో8 తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో జలాశయానికి ఆలస్యంగా వరద ప్రారంభమైంది. ఆల్మట్టి జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, గతేడాది సరిగ్గా ఇదే సమయానికే నిల్వలు 92.17 టీఎంసీలకు చేరడంతో, గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేశారు. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి లక్ష 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీని పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీ లు. ప్రస్తుతం ఆల్మట్టిలో 44.69 టీఎంసీ ల నీరు ఉంది.కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండాలంటే 120 టీఎంసీలకు పైగా వరద రావాలి.
గతేడాది సరిగ్గా ఇదే సమయానికి ఆల్మట్టిలో 92.17 టీఎంసీల నీరు ఉండటంతో అధికారులు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కానీ ఈసారి రుతుపవనాల ఆలస్యం వల్ల ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఒకవేళ వరుణుడు ముఖం చాటేస్తే రాబోయే రోజుల్లో నీటి పంపిణీ విషయంలో రాష్ట్రాల మధ్య మళ్లీ పాత వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు భావించారు. అయితే ప్రస్తుతం జూలై, ఆగస్టు నెలలపై ఉన్న ఆశలు ఎగువ వర్షాలతో నిజమయ్యేలా కనిపిస్తుండటంతో అటు రైతులు, ఇటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
Also Read: Nerella Incident: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు.. గంధం గోపాల్ కన్నుమూత!