భట్టి విక్రమార్క కొడుకు రిసిప్షన్‌కు కేటీఆర్ హాజరయ్యారట. ఆ సమయంలో కొందరు అక్కడే ఉన్న ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలు తనను కలిశారట. అన్న .. ! మీ సర్కారే వస్తది… తప్పకుండా మీరు మళ్లీ అధికారంలోకి వస్తారు.. అని చెప్పి తన చేతిలో చేయి కలిపి ముందస్తుగా అభినందనలు కూడా తెలిపారట. ఈ విషయం ఇవాళ జీవన్‌రెడ్డిని అతని ఇంట్లో కలిసి పార్టీలో ఆహ్వానించిన సందర్భంగా కేటీఆర్ అన్నాడు.
ఇది ఇవాళ ఒక్కసారి అన్న మాట కాదు.. పలు పార్టీ వేదికల మీద పదుల సార్లు కేటీఆర్ ఇవే మాటలు .. పొల్లు పోకుండా చెప్పి ఉన్నాడు. అతని మాటలు వింటే నిజంగా అక్కడ అదే జరిగిందా? ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలు అవే మాటలు అన్నారా? అసలు వారు కేటీఆర్‌ను ఎందుకు కలుస్తారు? కలిసినా అక్కడ ఆ వేదికగా ఈ మాటలు అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కేటీఆర్ మాములుగా రోజువారీగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేవి రొటీన్‌గా చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలు, భట్టి కొడుకు రిసిప్షన్ సన్నివేశాలంటూ బట్టీ పట్టి మరీ అవే మాటలు పదే పదే చెప్పడం వెనుక కేటీఆర్ వ్యూహమేమిటీ? అంటే ఇంకా ఇంతకు మించి మీ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత చెప్పనవసరం లేదు.. ఇదే పెద్ద ఉదాహరణ అని జనాలకు చెప్పదలుచుకున్నాడా? సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేయదలుచుకున్నాడా?? కేటీఆర్ శైలి, అతను చెప్పే విధానం చూస్తే అంతే అనిపిస్తున్నది.
లేక, ఖమ్మం పెద్దలపై కేటీఆర్ ప్రత్యేకంగా కత్తి కట్టారా? భట్టి విక్రమార్కతో పాటు కీలకమైన ఇద్దరు మంత్రులు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే. కీలకమైన శాఖలు వీరివి. ప్రభుత్వంలో పెద్ద తలకాయలు. కీలకమైన శాఖలు. వీరిని దెబ్బ కొడితే.. అక్కడ్నే వ్యతిరేకత ఇంతలా వచ్చిందనే సంకేతం ఇచ్చినట్టుగా చెబితే… అంతటా ఇలాగే అనుకుంటున్నారనే భావన కలిగించేలా పదే పదే అవే మాటలు చెప్పగలిగితే.. ఇదేనా కేటీఆర్ వ్యూహం..! ఇప్పుడిది రాజకీయాల్లో చర్చకు తెరతీస్తున్న అంశం.
ఇంతకు ముందు.. తాను ఎక్కడికెళ్లినా, ఎవరిని కలిసినా కేసీఆరే మళ్లీ రావాలనుకుంటున్నారని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పేవాడు. కానీ ఈ మాటలు అంతగా ప్రభావం చూపలేనట్టున్నాయి. తర్వాత కొంచెం ఘాటు తగిలించి కేసీఆర్ అన్న మాటలు… కత్తి ఎవరికో ఇచ్చి మమ్మల్ని యుద్దం చేయమంటే ఎలా? అనే డైలాగూ వాడిండు. కానీ అది బూమరాంగ్ అయింది. ఎందుకంటే.. జనం తీర్పునే అవమానించేలా ఆ మాటలున్నాయని, వీరికి ఇంకా అహంకారం తగ్గలేదనే కామెంట్లు కూడా వచ్చాయి.
అంటే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటం చేయరా, వారి పక్షాన నిలబడి కొట్లాడరా? అధికారం ఉంటేనే ప్రజల మేలు కోరుతారా? అనే ప్రశ్నలు కూడా సూటిగానే తగిలాయి కేటీఆర్‌కు. అందుకే ఇప్పుడు ఆ రూట్‌ను వదిలి .. కొత్తగా ఈ ఖమ్మం కాంగ్రెస్ కామెంట్స్‌ను బట్టీ పట్టాడా? అనే చర్చ కూడా జరుగుతున్నది.