FarmHouse case: చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సినిమాటిక్ డైలాగ్ చెప్పారు మంత్రి కేటీఆర్. మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ పై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని.. ఈ సమయంలో తానేమైనా మాట్లాడితే కేసును ప్రభావితం చేస్తున్నానని అంటారని అన్నారు. ఫోన్ కాల్ ఆడియోల్లోనే వారి బండారం బయటపడిందని అన్నారు. ఫామ్ హౌజ్ ఘటనపై స్వయంగా సీఎం కేసీఆరే మాట్లాడతారంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని బండి తాకారని తప్పుబట్టారు. ఆయన ప్రమాణం చేసినందుకు గుడిలో సంప్రోక్షణ చేయాలేమోనని పంచ్ లు వేశారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు. దొంగ ఎవరో, దొర ఎవరో ప్రజలకు తెలుసని.. అంతా ప్రజల ముందు ఉందని అన్నారు.
ఫామ్ హౌజ్ ఎపిసోడ్ లో కేటీఆర్ ముందునుంచీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఈ విషయంపై ఆయనేమీ స్పందించడం లేదు. పైగా పార్టీ నేతలెవరూ మాట్లాడ వద్దంటూ ట్వీట్ కూడా చేశారు. అంతా పోలీసులు, కోర్టు చూసుకుంటారని అంటున్నారు. ఈ స్ట్రాటజీ వెనుక వ్యూహం లేకపోలేదని చెబుతున్నారు. విషయం చాలా పెద్దది కావడం.. బీజేపీ జాతీయ నేతలకు లింకు ఉండటంతో.. ఈ ఎపిసోడ్ ను నేషనల్ లెవెల్ లోనే డీల్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. చిన్న నేతలెవరూ మాట్లాడకుండా కట్టడి చేసి.. మునుగోడులో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆరే నేరుగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కఠినంగా మాట్లాడతారని అంటున్నారు. నేరుగా ఢిల్లీనే టార్గెట్ చేసేలా కేసీఆర్ ప్రసంగం ఉండబోతోందని తెలుస్తోంది. అప్పటి వరకూ ఆడియో లీకులు, మీడియాలో బ్రేకింగులతో రాజకీయ వేడి రగిలించి.. ఆ బడబాగ్నిని కేసీఆర్ బ్లాస్ట్ చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, కేటీఆర్ సైతం ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారని అంటున్నారు.