KTR Criticism: రెండు లక్షల ఉద్యోగాలు ఒక మిథ్య..యువ వికాసం ఒక మిరాజ్.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ తెలంగాణ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసేలా ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఒక నాటకానికి తెరలేపారు.. నాటకీయ లైటింగ్ మధ్య ఇరానీ చాయ్ తాగుతూ, ఫొటోలకు పోజులిస్తూ, ఆకాశమే హద్దుగా రాహుల్ గాంధీ హామీలు గుప్పించారు.మూడేళ్ల తర్వాత అసలు నిజం బయటపడిందని అన్నారు. ఎక్స్ వేదికగా గురువారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దుయ్యబట్టారు.
ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదు.. చాయ్ తాగుతూ చేసే పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదు.. ఉద్యోగాలు కల్పించాలంటే దార్శనికత ఉండాలి..కనీసం ఒక్క ఉద్యోగం కల్పించాలన్నా అచంచలమైన నిబద్ధత ఉండాలి..మీరు విఫలమయ్యారు అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, మీ మొత్తం విదూషకుల బృందం తెలంగాణ యువతకు ఏమీ చేయలేరని పదేపదే నిరూపించుకున్నారన్నారు. కానీ రాహుల్ గాంధీ మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ కోసం నిరంకుశ కాంగ్రెస్‌తో పోరాడిన యువత మళ్లీ పోరాడగలరు. కాంగ్రెస్ దుష్ట కబంధ హస్తాల నుంచి తెలంగాణను మరోసారి విముక్తి చేయడానికి వారు పోరాడతారని హెచ్చరించారు. ఇది కేసీఆర్ గడ్డ!ఇది పోరాట యోధుల గడ్డ!పోరాట యోధులు ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోరు! అని అన్నారు.
కేసీఆర్ పాలనలో కళకళలాడిన గ్రామాలు ఇవ్వాళ కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ పంచాయతీలు, 2024–25 నాటికి ఆర్థిక లోటులోకి జారుకున్నాయన్నారు. తెలంగాణ గ్రామ పంచాయితీల వ్యయం2022-23లో సగటున రూ 16.59 లక్షలు ఉంటే2024-25 నాటికి కేవలం రూ 6.24 లక్షలకు దిగజారిందన్నారు. దీంతో గ్రామాల్లో కొత్తగా ఏ అభివృద్ధి పనులూ జరగకపోగా కనీసం పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ కూడా సరిగ్గా లేదన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసంఆనాడు కేసీఆర్ కృషిచేస్తే..ఇవ్వాళ కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనలో తెలంగాణ పల్లెలు గొల్లుమంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు సమన్లు.. మరోసారీ హాజరుకావాలని ఆదేశం!