Sandeep Kumar: భారత రాజ్యాంగ విలువలు, స్వాతంత్ర్య పోరాట చరిత్రపై నెక్లెస్ రోడ్ వేదికగా ఏఐసీసీ ఇన్చార్జ్ సందీప్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయన్నారు. ఎన్నో దేశాలు మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రేమ, సమానత్వంతో కూడిన ఈ రాజ్యాంగం డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. దేశ రాజ్యాంగం, కాంగ్రెస్ సిద్ధాంతం వేరుకాదని, రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు.
13 ఏళ్లలో రాజ్యాంగానికి ఇబ్బందులు..
గత 13 ఏళ్లుగా దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో పడిందని సందీప్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడా పాల్గొనలేదని ఆయన విమర్శించారు. దేశ స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని తెలిపారు.
రైతులు, పేదలపై కేంద్రం తీరు..
లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ రైతులకు, సైనికులకు అండగా నిలిస్తే.. ప్రస్తుత ప్రధాని మోడీ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ నినాదంతో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తే.. మోడీ మాత్రం పేదలే లేకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సత్యం, అహింస మధ్య పోరాటం..
ప్రస్తుతం జరుగుతున్నది కేవలం రాజకీయ పోరాటం కాదని.. హింసకు, అహింసకు మధ్య జరుగుతున్న పోరాటమని సందీప్ కుమార్ పేర్కొన్నారు. సత్యం, అసత్యం మధ్య సాగుతున్న ఈ యుద్ధంలో అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదేనని ధీమా వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.