Telangana High Court: కోర్టు ఆదేశాల్ని పట్టించుకోకపోతే ఎంతటి అధికారులకైనా సరే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భూ వివాదంలో రక్షణ కల్పించాలన్న ఆదేశాల్ని నిర్లక్ష్యం చేసినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు హైకోర్టు జైలు శిక్ష విధించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది?
ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు గతంలో స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
శిక్ష, జరిమానా వివరాలు
ఈ కేసులో సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డికి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి చెరో రెండు వారాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం గౌరవాన్ని, ఆదేశాల తీవ్రతను గుర్తుచేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
వారం రోజుల గడువు
అయితే, ఈ శిక్షపై హైకోర్టు వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించింది. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అధికారులకు ఈ వారం రోజుల సమయం ఇచ్చింది. ఈ గడువులోగా ఎలాంటి ఉత్తర్వులు తీసుకురాకపోతే, నేరుగా హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టంగా ఆదేశించింది.
Also Read: 13 ఏళ్లుగా రాజ్యాంగానికి ప్రమాదం.. మోదీ ప్రభుత్వంపై సందీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!