భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి గొప్ప గౌరవం ఉంది. అయితే పరిశుభ్రత విషయంలో మాత్రం ఆశించిన మార్పు మాత్రం రావడం లేదు. ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ వంటి భారీ కార్యక్రమాలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరా మార్కెట్‌లో ఒక ఇజ్రాయెల్ యువతికి ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
⦿ ఇజ్రాయెల్ యువతి ఆవేదన.. పర్యాటక ప్రాంతాల్లో ఇదేనా పరిస్థితి?
ఉత్తరాఖండ్ పర్యటనకు వచ్చిన ఒక ఇజ్రాయెల్ యువతి అల్మోరా మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడింది. ఆ ప్రాంతంలో ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా కనిపించకపోవడంతో ఆమె విస్మయం వ్యక్తం చేసింది. తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ వంటి గొప్ప దేశంలో పర్యాటకుల కోసం కనీస వసతులు లేకపోవడం బాధాకరమని ఆమె పేర్కొంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రచారాలు ఆర్భాటంగా సాగుతున్నా ఆచరణలో మాత్రం శూన్యమని మండిపడుతున్నారు.
⦿ హైదరాబాద్‌లో మహిళల కష్టాలు వర్ణనాతీతం
దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో కూడా ఇదే దుస్థితి నెలకొంది. నగరం నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది ప్రజలు పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. కానీ వారికి సరిపడా పబ్లిక్ టాయిలెట్లు లేవు. ముఖ్యంగా బయట ఊర్ల నుంచి వచ్చే ప్రయాణికుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. నగరంలో చిన్న వ్యాపారం చేసుకునే మహిళలు, స్కూలుకు వెళ్లే పిల్లలు, మహిళా పోలీసులు, జర్నలిస్టులు ప్రతిరోజూ నరకం చూస్తున్నారంటే వారి పరిస్థితి గురించి అర్థం చేసుకోవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన గదులు లేక గంటల తరబడి ఆపుకోవాల్సి వస్తోంది. దీని వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
⦿ అలా అయితే ప్రాణాలకే పెను ప్రమాదం…
సమయానికి మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల ప్రాణాపాయం వెంటనే కలగకపోవచ్చు గానీ.. అది దీర్ఘకాలికంగా శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం మహిళల్లో దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి..
➼ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI): మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
➼ కిడ్నీ స్టోన్స్: మూత్రంలోని మినరల్స్ గడ్డకట్టి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
➼బ్లాడర్ సమస్యలు: మూత్రాశయం సాగిపోవడం వల్ల కాలక్రమేణా బ్లాడర్ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది.
⦿ ప్రభుత్వానికి విజ్ఞప్తి.. మహిళల డిమాండ్ ఇదే..
హైదరాబాద్ నగరంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్‌ను మహిళలు వేడుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని టాయిలెట్లకు తాళాలు వేసి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని టాయిలెట్లు ఓపెన్ చేసి ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితి మాత్రం పరమ అధ్వాన్నంగా నెలకొంది. ఆ కంపు వాసనకు భరించలేక మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ సమస్యను వీలైనంత త్వరగా కమిషనర్ ఆర్. వీ కర్ణన్ పరిష్కరించాలని మహిళా లోకం వేడుకుంటుంది.
⦿ మహిళల ఇబ్బందులు వర్ణనాతీతం..
పీరియడ్స్ సమయంలో మహిళలు పడే ఇబ్బందులు అయితే వర్ణనాతీతం. రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల సమీపంలో అత్యవసరంగా టాయిలెట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తేనే స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరుతుంది.
Also Read: రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు