GHMC: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడి, ఆ తర్వాత మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా, కోర్ అర్బన్ రీజియన్ లో అతి పెద్ద కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీలో త్వరలోనే కింది స్థాయి ఉద్యోగుల లోకల్ ట్రాన్స్ ఫర్లు జరగనున్నట్లు తెలిసింది. ఈ నెల 11న మూడు కార్పొరేషన్లుగా ఏర్పడిన తర్వాత, కొత్త కార్పొరేషన్లుగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వివిధ విభాగాల వారీగా పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్స్ ఉద్యోగులను ఆగ మేఘాలపై బదిలీలు చేసిన సంగతి తెల్సిందే. ఇందులో పర్మినెంట్ ఉద్యోగుల మాట అలా ఉంచితే అంతంత మాత్రం జీతాలు విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్స్ ఉద్యోగుల్లో కొందరు విధులు నిర్వహించాలంటే ఏకంగా 60 కి.మీ.ల నుంచి 120 కిలోమీటర్ల మేరకు రాకపోకలు సాగించాల్సి వస్తుంది.
Also Read: SS Rajamouli: హైదరాబాద్‌లోనే అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సౌకర్యం.. ఆవిష్కరించిన దర్శకధీరుడు!
ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతుండటంతో మరోసారి బదిలీలు చేసేందుకు అధికారులు జాబితాను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ సారి బదిలీల్లో స్థానికతను ప్రాధాన్యతగా తీసుకుని ట్రాన్స్ ఫర్లు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రకంగా చేస్తే ఔట్ సోర్స్ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం పర్మినెంట్ ఉద్యోగులు కేవలం మూడున్నర వేల మంది ఉండగా, దాదాపు 20 వేల పై చిలుకు ఔట్ సోర్స్ ఉద్యోగులున్నారు. వీరిలో సింహాభాగం ఔట్ సోర్స్ ఉద్యోగులు ఐటీ, ట్యాక్స్, ఎలక్ట్రికల్ ఇతరత్రా విభాగాల్లో కీలక విధులు నిర్వహిస్తుండగా, మరి కొన్ని విభాగాల్లో ఔట్ సోర్స్ ఉద్యోగులే మేయిన్ సోర్స్ ఉద్యోగులు కీలకంగా మారారు.
ఇటీవలే మూడు కార్పొరేషన్లకు బదిలీలైన ఉద్యోగుల్లో చాలా మంది ఒక కార్పొరేషన్ పరిధిలో నివాసముంటూ మరో కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. హయత్ నగర్ కన్నా దూరంలో నివసించే ఓ పర్మినెంట్ ఉద్యోగి మోతీనగర్ సర్కిల్ లో విధులు నిర్వహించేందుకు ప్రతి రోజు 120 కిలోమీటర్ల వరకు రాకపోకలు కొనసాగిస్తూ, చివరకు అనారోగ్యం పాలై హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ఈ విషయంపై కొన్ని యూనియన్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా ఒక కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు అదే కార్పొరేషన్ పరిధిలో గానీ, ఇరుగు పొరుగుగా సమీపంలోని కార్పొరేషన్ పరిధిలోని వివిధ విభాగాల కార్యాలయంలో విధులు నిర్వర్తించేలా ఈ బదిలీలుండనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఔట్ సోర్స్ ఉద్యోగుల చిరునామా, వారు విధులు నిర్వహిస్తున్న కార్యాలయం ఉన్న ప్రాంతాలు, వారి ఆరోగ్యపరమైన సమస్యలు వంటి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. వివరాల సేకరణానంతరం ఔట్ సోర్స్ ఉద్యోగులకు వారి క్యాటగిరి ప్రకారం సమీపంలోని ఆఫీసులో విధులు నిర్వర్తించేలా ఈ బదిలీలు చేసే దిశగా కసరత్తు కొనసాగుతనున్నట్లు తెలిసింది.
Also Read: Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునే ముందు ఈ 5 సైడ్ ఎఫెక్టుల గురించి తెలుసుకోండి