Mahbubabad : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. “నా కూతురుకి పెళ్లి చేసి అమెరికా పంపిస్తా. నా కొడుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేర్పిస్తా. నాకు 54 సంవత్సరాలు దాటాయి. బతికినకాడికి చాలు. ఇక శంకర్ వేట మొదలైంది. నా సత్తా చూపిస్తా” అని సవాల్ విసిరారు.
“నేను కేసీఆర్ ఒక్కటే కార్తెలో పుట్టాం. నా నియోజకవర్గం కాపాడుకునే సత్తా నాకు ఉంది. నీనేంటో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు. మళ్లీ మీకోసం వస్తా. మనం ఎవరిజోలికి పోవద్దు మన జోలికి ఎవ్వడైన వస్తే వాడిని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవ్వరూ లేరు. ఆపే శక్తి కూడా ఎవ్వడికీ లేదు” అని శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానుకోటలో ఏ దిక్కున చూసినా శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. మండల విసృత స్థాయి సమావేశంలో మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు కంట తడి పెట్టుకున్నారు.
ఇప్పుడు శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. ఎందుకిలా మాట్లాడరానే చర్చ మొదలైంది.