Transgenders: పోలీస్ శాఖలో చేరాలనుకుంటున్న ట్రాన్స్ జెండర్ల కోసం మల్కాజిగిరి కమిషనర్ బీ.సుమతి ప్రత్యేక సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానిస్టేబుళ్లు, ఎస్ఐలుగా చేరాలనుకుంటున్న 20మంది ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా నాలుగు నెలలపాటు ప్రత్యేక రాత పరీక్షల కోచింగ్ ను అందిస్తుండటంతోపాటు హాస్టల్ వసతిని కల్పించారు. కమిషనర్ చేసిన అభ్యర్థన మేరకు సంబంధిత శాఖ హాస్టల్ ఖర్చుల నిమిత్తం 3.50లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.
శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించిన కమిషనర్ సుమతి ఎంపికైన 20మంది అభ్యర్థులకు భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, అంకగణితం, రీజనింగ్, భూగోళ శాస్త్రం, కరెంట్ టాపిక్స్, ఆర్థికశాస్త్రం తదితర అంశాలకు సంబంధించిన అధ్యయన సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభ్యర్థులకు వసతి, నిరంతర కోచింగ్ అందించనున్నట్టు చెప్పారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దగ్గరుండి దీనిని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణర, ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.
దిల్ సుక్ నగర్ లోని యూనిక్ కోచింగ్ సెంటర్, కల్పన హాస్టల్ తో సమన్వయం చేసుకుని ఈ శిక్షణను అందిస్తున్నట్టు తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ తోపాటు సంబంధిత శాఖల ప్రతినిధులు, అధ్యాపకులు, హాస్టల్ నిర్వహణా సిబ్బందితో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ లో పలువురు ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్టు చెప్పారు. మల్కాజిగిరి కమిషనరేట్ లో ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ సమన్వయకర్త ప్రీతి సునంద, మహిళా భద్రతా విభాగం డీసీపీ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Also read: నవ్వుతూ కస్టమర్‌గా వచ్చి 4 తులాల బంగారం లేపేశాడు.. కానీ చివరికి..?