Telangana Congress: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ పదవుల జాతర మొదలు కానుంది. దీనిపై కసరత్తు మొదలై పోయింది. పీసీసీ అధ్యక్షుడి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం నేతల మధ్య పోటీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది.
ఆ పదవి దక్కించుకుంటే ఫ్యూచర్‌లో లైఫ్ ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారు కొందరు నేతలు. ఆ తర్వాత పీసీసీ పదవికి పోటీ పడవచ్చని భావిస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులకు నేతల పేర్లపై కసరత్తు జరుగుతోంది.
సామాజిక వర్గానికి ఒకటి చొప్పున వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ కుమార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఒకటి చొప్పున ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీలు ఉండడంతో వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఓ వర్గం నేతలు బలంగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో గత ఫార్ములాను అనుసరించాలని పార్టీ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్, బెల్లయ్యనాయక్, ఎస్సీల నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మైనార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, ఓసీల నుంచి ఎంపీతోపాటు మాజీ ఎంపీలు, కొందరు నేతలు రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: పాతబస్తీకి మెట్రో వస్తే మాకు ఇబ్బంది – ఈ ప్రాజెక్టు వద్దే వద్దు
పార్టీ పదవుల కోసం సీనియర్ నేతలతోపాటు జూనియర్లు ఎక్కువ మంది పోటీపడడంతో జిల్లాకు ఒకరి చొప్పున నియమించాలనే ప్రతిపాదనలను సైతం పరిశీలిస్తోందట కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో జిల్లాకు రెండు పదవులు సూచించాలని జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులకు పార్టీ సూచన చేసిందట.
క్షేత్రస్థాయిలో అంకితభావంతో పని చేసే వారిని పీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించినట్టు పార్టీ వర్గాల మాట. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడే పని చేసేవారి వివరాలను పీసీసీ అధ్యక్షుడు సేకరిస్తున్నారట.
మొత్తానికి వారంలోగా పార్టీ పదవులను పూర్తి చేసి తర్వాత స్థానిక ఎన్నికల బాధ్యత ఆయా నేతలకు అప్పగించాలనే ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల పదవులు దక్కినవారు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఖరారు కాగానే జాబితా ఢిల్లీకి పంపి ఏఐసీసీ పెద్దలతో ఆమోదం తర్వాత అధికారికంగా ప్రకటన రానుంది.