Ponguleti Srinu : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి పేలిపోయాయి. దాంతో.. మంత్రి పొంగులేటి కాన్వాయ్ లోని ఆయన సిబ్బంది కంగారు పడిపోయారు. మంత్రి కారు.. ఎక్కడ అదుపు తుప్పుతుందో అని కంగారు పడిపోయారు. కానీ.. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్.. కారును అదుపు చేశారు. దాంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హన్మకొండ ఐడీవోసీలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. తిరిగి ఖమ్మం వెళుతుండగా తిరుమలాయపాలెం దగ్గరకు రాగానే ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కాన్వాయ్ లోని శ్రీనివాస రెడ్డి ప్రయాణిస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలి పోయాయి. ప్రమాద సమయంలో కారులో మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, DCCB చైర్మన్లు బొర్రా రాజశేఖర్, తళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మంత్రులు కొండా సురేఖ , దనసరి అనసూయ (సీతక్క) లతో కలసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కలెక్టర్ల కార్యాచరణ, సమన్వయ సమావేశం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై గ్రామ, వార్డు సభల నిర్వహణపై చర్చించారు. అధికారుల బృందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు.? కార్యాచరణ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26వ తేదీన నాలుగు నూతన పథకాలను ప్రారంభించనుండగా.. వాటిపై చర్చించారు. వాటిపై చర్చించిన మంత్రులు.. అర్హత ఉండి ప్రజాపాలన యాప్ లో నమోదు కానీ దరఖాస్తులు మ్యానువల్ గా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత.. జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలతో ఖమ్మం చేరుకునేందుకు మంత్రి బయలుదేరగా.. దారి మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.
పండుగ సందర్భంగా కూసుమంచిలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయాన్నే కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభం కానున్న షెడ్యూల్.. ఉదయం 10 గంటలకు రఘునాథపాలెం ఐడీఓసీ లో.. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ పథకాల అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల కోసం.. జిల్లాకు చేరుకుంటున్న మంత్రికి.. రాత్రి వేళ ప్రమాదం జరగడంతో అంతా ఆందోళనలు చెందుతున్నారు.
Also Read : మాజీ ఎంపీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..
ఐతే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఎలాంటి ప్రమాదము లేదని ఆయన భద్రతా అధికారులు తెలిపారు. మంత్రి కారు ప్రమాదం తర్వాత కాన్వాయ్ లోని వేరే కారులో జిల్లాకు చేరుకున్నట్లు తెలిపారు. కారు ప్రమాదంపై పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు.