Minister Uttam Kumar Reddy: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలు, కెనాళ్ల పునరుద్ధరణకై వారంరోజుల్లో టెండర్లు పిలవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై.. గురువారం ఎర్రమంజిల్ లో ఉన్న జలసౌధ కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కాలువలతో పాటు.. పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్లు పిలిచి.. ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాలనాపరమైన అనుమతులు తీసుకుని శుక్రవారం ఉదయానికల్లా టెండర్లను ఆన్లైన్ లో అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు.
భారీవర్షాలలోనూ విధులు నిర్వహించిన నీటిపారుదల శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు. క్షేత్రస్థాయిలో తాను పర్యటించిన సమయంలో కొన్ని వాస్తవాలు తెలుసుకున్నానని, రెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఉంటే విపత్తులు వచ్చినపుడు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక చోట రెగ్యులేటరీ జామ్ అవ్వగా.. మరో ప్రాంతంలో షట్లర్ ఎత్తతుండగా తెగిపోయిందన్నారు. ఇలాంటివి మళ్లీ జరిగితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇలాంటి ఘటనలపై సీఈలో బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.