Kannepalli Pump House: తెలంగాణలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయా? అధికార పార్టీ లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? రోజుకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల అటెక్షన్‌ను తనవైపు డైవర్ట్ చేస్తోందా? బీజేపీని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అసలు ఏం జరుగుతోంది?
శనివారం కేటీఆర్.. ఆదివారం హరీష్‌రావు.. మరి సోమవారం ఏ నేత వంతో? అధికార పార్టీ నేతలు లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. రేవంత్ సర్కార్‌ని ఇరుకున పెట్టేందుకు రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ఆ పార్టీ నేతలు. పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర జరుగుతోందన్నది ఎమ్మెల్యే హరీష్‌రావు మాట.
హరీష్‌రావు వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ గట్టిగానే కౌంటరిచ్చారు. ప్రతీ ఏడాది జులై చివర్లో లేకుంటే ఆగస్టు మొదటి వారంలో కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి పంటలకు నీరందిస్తామని తెలిపారు. ఈసారి అదే విధానం అమలు చేస్తామని, ఈ విషయంలో రైతులు సందేహించాల్సిన అవసరం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ హరీశ్‌రావు పదే పదే మాట్లాడటాన్ని తప్పుపట్టారు. పదేళ్లలో చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి బీఆర్ఎస్.. మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ రైతులను మోసం చేయాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు.
ALSO READ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ టికెట్ ఎవరికంటే..
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి సదరు మంత్రి ఉత్తమ్. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కణ్నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదారిలో పోసిన విషయం మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గరి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి తర్వాత అన్నారం, సుందిళ్లకు నీటిని ఎత్తిపోయాలన్నారు. ఆ మూడు బ్యారేజీలను తప్పుడు సాంకేతిక టెక్నాలజీతో గత ప్రభుత్వం నిర్మించిందని, ఈ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్‌డీఎస్ఏ హెచ్చిరించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇంతకీ బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఏమన్నారు? కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీరు తీసుకునే స్థాయి కంటే రెండున్నర మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లు ఉన్నాయన్నారు. అయినా మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడిగడ్డ సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
సాగునీటి కోసం రైతులు అల్లాడు తుంటే, ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా ఉండటాన్ని తప్పుబట్టారు. రైతులను ఆదుకోవడానికి తక్షణమే పంప్‌హౌస్ మోటార్లను ప్రభుత్వం ప్రారంభిస్తుందా లేకుంటే తాము వెళ్లి ఆన్ చేస్తామని నిలదీశారు. అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులతో పంప్‌హౌస్‌కి మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు హరీష్‌రావు.