బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారు అని రెండ్రోజుల కిందట సంకేతం ఇచ్చారు. బయటకు రావడం రావడమే రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘మా హయాంలో ఇలా ఉందా? మేం ఇలాగే చేశామా? ఇదేం ప్రభుత్వం.. దద్దమ్మ ప్రభుత్వం.. సర్రభ్రష్ట ప్రభుత్వం’ అంటూ నిప్పులు చెరిగారు.‘కాస్కోండి ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అని రేవంత్ సర్కారుకు సవాల్ విసిరారు. తమ పోరాటం నదీ జలాలపైనే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. రానున్న రోజుల్లో మరో ప్రజాఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపడం అనేది ప్రతిపక్ష పార్టీపై ఉన్న ప్రధాన బాధ్యత. దాని ఎవరూ తప్పుపట్టరాదు.గతంలో బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ సైతం వారి తప్పులను ఎత్తిచూపింది. ఫలితంగా ప్రజలు వారి పనితీరు మెచ్చి అధికారం కట్టబెట్టారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై అధికార పార్టీకి చెందిన మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరగలేదని, అడ్డగోలు దోపిడీ జరిగిందని విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే తాము సంక్షేమ పాలన అందిస్తున్నామని ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ హయాంలో 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని, దాంతో ప్రభుత్వం మీద ఎనలేని భారం పడుతోందని, వాటికి వడ్డీ ప్లస్ అసలు కట్టలేక తడిసిమోపేడవుతుందని మంత్రి ఉత్తమ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ఇక ఒక్కొక్కరి తోలు తీస్తానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి సైతం గట్టిగానే బదులిచ్చారు. గతంలో గులాబీ పార్టీలో మంత్రిగా చేసిన ఆయన గతంలో వారు చేసిన తప్పులను గుర్తుచేస్తూ నిలదీశారు.బీఆర్ఎస్ పార్టీలో ఇప్పడు కండ లేదని కేవలం తోలే మిగిలిందని సెటైరికల్‌గా ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపిందని చెబుతున్నారు? ఎవరి హయాంలో వచ్చిందని నిలదీశారు? మరోమంత్రి వాకిటి శ్రీహరి సైతం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌కు పాలమూరు రంగారెడ్డి మీద ఆసక్తి లేదని.. కాళేశ్వరం మీద డబ్బులు వృథా చేశారని.. కమీషన్ల కోసమే కాళేశ్వరంను ముందుకు తెచ్చారని.. పాలమూరును పట్టించుకోలేదని మండిపడ్డారు.
నదీ జలాలపై అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్.. అదే అంశం మీద చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రారు? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పాలమూరు రంగారెడ్డి, కృష్ణా నదీ జలాలపై చర్చ జరుపుతామని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి? ఆయన గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలుగకుండా మేం చూసుకుంటామని మంత్రి పొన్నం చెప్పారు.ఇక గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులు ట్రాష్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మీ హయాంలో జరిగిన ఎంవోయూలు, ఒప్పందాలపై తాము ఇలాగే మాట్లాడామా? పెట్టుబడిదారులను కించపరిచి, వారిని నిరుత్సాహ పరచొద్దని ఆయన ఫైర్ అయ్యారు. కాగా,
అధికార పార్టీపై విమర్శలు చేసిన కేసీఆర్.. మంత్రుల వ్యాఖ్యలపై ఇంతవరకు స్పందించంలేదు. కౌంటర్ ఇవ్వలేదు. ఆయనే కాదు ఆ పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు. దీనిని బట్టి కేసీఆర్ చెప్పినవే అబద్దాలా? అని ప్రజలు నిర్దారణకు రావొచ్చు.అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉండాలి..అప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటేనే ప్రజలకు సైతం ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో స్పష్టంగా తెలిసివస్తుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.