Addanaki Dayakar: కవిత రాసిన లేఖ ఎవరు లీక్ చేశారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కవిత ఆఫీస్ నుంచి రిలీజ్ అయిందా? కేసీఆర్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిందా అని నిలదీశారు. లేఖను కేసీఆరే బయటపెట్టించారా? కేటీఆర్ తన మనుషులతో రిలీజ్ చేయించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌తో హరీశ్ రావు, కేటీఆర్ కలిసి మాట్లాడే అవకాశం ఉందని కానీ.. సొంత కుమార్తె మాత్రం కలవలేకపోతుందన్నారు అద్దంకి దయాకర్..
కాగా డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్‌ను ఓ కుదుపు కుదిపేసింది. ఈ లేఖ లీక్ అవడంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడు లాంటి వారని.. కానీ.. ఆయన చుట్టు మాత్రం దెయ్యాలున్నాయని అన్నారామె. పార్టీ అభివృద్ధి కోసం రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. తాను రాసిన లేఖే బయటకు వచ్చిందంటే.. పార్టీలోని సామాన్యుల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు.
రెండు వారాల క్రితం రాసిన లేఖ.. తాను లేని టైంలో బహిర్గతం చేశారని మండిపడ్డారామె. గతంలో కూడా చాలా లేఖలు రాశానని అన్నారామె. అప్పుడు లేని లీకులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయని కవిత నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. తన పై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని రీసెంట్ గా చెప్పానని గుర్తు చేశారామె. ఇప్పుడు ఈ లెటర్ లీక్ అవ్వడంతో అది నిజమని అందరికీ క్లారిటీ వచ్చిందన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు కవిత.
లేఖలో కొత్త అంశాలేమీ రాయలేదని ఆమె వివరణ. తెలంగాణ ప్రజలు, పార్టీలో కార్యకర్తలు అనుకుంటున్న విషయాలనే అధినేత దృష్టికి లేఖ ద్వారా తెలిపానని చెప్పారామె. ఇందులో తన వ్యక్తిగత అజెండా లేదని చెప్పుకొచ్చారు. ఎవరిపైనా తనకు ద్వేషం లేదని.. కానీ.. తనపైనే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దెయ్యాలున్నాయని కవిత ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనేదానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
Also Read: నెక్ట్స్ ఏంటి? కేసీఆర్‌కు కవిత కిరికిరి!
ఇప్పుడు.. కవిత లేఖ ఎలా లీకైందనే దానికంటే.. ఆ లేఖ వల్ల మున్ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారిపోతాయన్నది ఆసక్తిగా మారింది. పార్టీలో తాను కోరుకున్న హోదా, తనకు కావాల్సిన ప్రాధాన్యం ఇవ్వకపోతే.. కవిత ఏం చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది. కవిత లేఖాస్త్రం.. పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకు చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ సీనియర్ల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల దాకా.. అంతా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. మొత్తంగా.. పార్టీలో తాను కోల్పోయిన ప్రాధాన్యత, ప్రాభవం, వైభవం కోసం.. ఇన్నాళ్లూ తాను అనుభవించిన ఫ్రస్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకే.. కవిత ఆ లేఖ రాసి ఉండొచ్చనే చర్చ సాగుతోంది. కానీ.. వాస్తవంగా కవిత ఏ ఉద్దేశంతో.. లేఖాస్త్రాన్ని సంధించారనేది త్వరలోనే తేలిపోతుంది.