కలెక్టరేట్ ప్రాంగణాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాలన్నిటినీ తొలగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. అవి తెలంగాణ తల్లి విగ్రహాలు కావని, కాంగ్రెస్ తల్లి విగ్రహాలని విమర్శించారు. ఆ విగ్రహాలన్నిటినీ తీసేసి గాంధీ భవన్ కి పంపిస్తామని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆ పని మొదలు పెడతామని చెప్పారామె.
మరీ ఇంత అహంకారమా..?
తెలంగాణపై పేటెంట్ రైట్ తమదేనన్నట్టుగా మాట్లాడుతుంటారు బీఆర్ఎస్ నేతలు. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ తోపాటు అనేక పార్టీలు నిరసనలు, ధర్నాల్లో పాల్గొన్నాయి. అందరి ఉమ్మడి కృషి ఫలితమే తెలంగాణ. కాంగ్రెస్ సహకారం, చొరవ లేకపోతే తెలంగాణ సాధ్యమేనా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. తెలంగాణ కల సాకారమైన తర్వాత మాత్రం బీఆర్ఎస్ ఆ క్రెడిట్ అంతా తమదేనంటోంది. అదే తరహాలో ప్రచారం చేసుకుంది కూడా. ఆ భ్రమలోంచి బయటపడేందుకు ప్రజలకు తొమ్మిదేళ్లు టైమ్ పట్టింది. తెలంగాణ పేరుని రాజకీయం కోసం వాడుకుని బాగుపడ్డది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేననే విషయం ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే 2023లో కాంగ్రెస్ ని గద్దెనెక్కించారు. దీంతో బీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలకు బ్రేక్ పడింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా కాంగ్రెస్ ప్రజాభిప్రాయంతో ముందుకొచ్చింది. తెలంగాణ తల్లి ఒక సామాన్య మహిళగా, ఆర్భాటాలకు తావులేకుండా ప్రభుత్వం కొత్త రూపాన్నిచ్చింది. ఆ విగ్రహం బీఆర్ఎస్ కి నచ్చలేదు. ఇక్కడ నచ్చనిది బీఆర్ఎస్ కి మాత్రమే, తెలంగాణ ప్రజలకు కాదు. కానీ బీఆర్ఎస్ కి నచ్చకపోతే ప్రజలకు కూడా నచ్చలేదన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తామంటూ కవిత చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరీ ఇంత అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు.
కలెక్టరేట్లలో ప్రభుత్వం పెట్టాలనుకుంటున్న విగ్రహం తెలంగాణ తల్లిది కాదు. ఆమె కాంగ్రెస్ తల్లి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ విగ్రహలన్నీ గాంధీ భవన్ కు తరలిస్తాం
– ఎమ్మెల్సీ కవిత pic.twitter.com/YJflnTHKKZ
— Telugu360 (@Telugu360) June 24, 2025
అధికారంలోకి వచ్చేది ఎవరు..?
మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని సెలవిస్తున్నారు కవిత. తాము అంటే ఎవరు..? మెడలో జాగృతి జెండా వేసుకున్న కవిత ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. దెయ్యాలున్న పార్టీ అంటూ నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ ని తిట్టారు, కేసీఆర్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు, సొంత కుంపటి పెట్టుకున్నారు, సొంత జెండా, సొంత కండువాలతో హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మాదే అధికారం అంటున్నారు కవిత. ఈ వ్యాఖ్యల అంతరార్థమేంటో తేలాల్సి ఉంది.
విగ్రహాల రాజకీయం..
విగ్రహాల రాజకీయంలో కవిత దిట్ట అని మండిపడుతున్నారు నెటిజన్లు. 9 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఎప్పుడూ కవిత మాట్లాడలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆమెకు బీసీలు గుర్తొచ్చారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనే డిమాండ్ మొదలు పెట్టారు. తొమ్మిదేళ్లుగా మీరేం చేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం ఆమె నుంచి సమాధానం ఉండదు. లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లొచ్చిన తర్వాత ఆమెలో అభద్రతా భావం మరింత పెరిగింది. పార్టీలో తన ప్రాధాన్యం తగ్గుతుందనే అనుమానం మొదలైంది. అన్న-చెల్లెలు మధ్య దూరం పెరిగింది. బీఆర్ఎస్ అంతర్గత పోరు ఆసక్తికరంగా మారింది. జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకుని మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కవిత. మరోసారి విగ్రహాల రాజకీయం మొదలు పెట్టారు.